AP Voter Revision Final List October 3:   ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ  ప్రక్రియ సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో ఏకంగా 44.89 లక్షల ఓటర్లు అంటే సుమారు 10.8 శాతం ఓటర్ల పేర్లను అధికారులు ముసాయిదా జాబితాలో అన్ కలెక్టబుల్  కేటగిరీ కింద తొలగించేందుకు సిద్ధం చేశారు. జులై 31న విడుదలైన ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3.71 కోట్లకు పడిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి రేపుతోంది.

Continues below advertisement

పది శాతానికిపైగా ఓట్ల గల్లంతు

ఈ భారీ ఓట్ల గల్లంతు వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. 15.22 లక్షల మంది మరణించిన వారు కాగా, 22.99 లక్షల మంది శాశ్వతంగా నివాసం మారినవారు లేదా ఫారమ్‌లు సమర్పించని అన్ కలెక్టబుల్  కేటగిరీలో ఉన్నారు. మరో 7.37 లక్షల ఓట్లను ఒకే వ్యక్తికి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లుగా అధికారులు వర్గీకరించారు. ముఖ్యంగా రాయలసీమ , కోస్తా జిల్లాల్లో ఓట్ల రద్దు అత్యధికంగా నమోదైంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 2.91 లక్షల ఓట్లు, తిరుపతి జిల్లాలో 2.88 లక్షలు, కర్నూలులో 2.74 లక్షలు, అనంతపురంలో 2.48 లక్షలు, వైఎస్సార్ కడపలో 2.45 లక్షలు, విశాఖపట్నంలో 2.39 లక్షల ఓట్లు తొలగింపు లిస్టులోకి వెళ్లాయి.

Continues below advertisement

జాబితాలో అన్నిపార్టీల సానుభూతిపరులు

ఈ భారీ ప్రక్రియ వెనుక అసలేం జరుగుతోంది.. వీరంతా ఎటు పోయారనే ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఉపాధి, విద్య, వ్యాపార రీత్యా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేదా ఇతర నగరాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారు క్షేత్రస్థాయి రీ-వెరిఫికేషన్ సమయంలో లభించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.   రాజకీయ నష్ట  కోణంలో చూస్తే, ఈ ఓట్ల గల్లంతు ప్రభావం రెండు ప్రధాన పార్టీలపై పడే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ సొంత ఊళ్లకు వచ్చి ఓటేసే  మైగ్రెంట్  ఓటర్లు వైఎస్సార్‌సీపీ లేదా టీడీపీ మద్దతుదారులనే లెక్కలు పార్టీల వద్ద ఉన్నాయి. క్షేత్రస్థాయిలో తమ మద్దతుదారుల పేర్లు పొరపాటున ఈ 44 లక్షల జాబితాలో చేరాయేమోనని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో పాటు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల వేళ ఈ ఓట్ల వ్యత్యాసం గెలుపోటములను శాసించే స్థాయిలో ఉంది.

ఎంత మందిని వెనక్కి తీసుకురాగలరు?

ఎన్నికల సంఘం,  సీఈఓ వివేక్ యాదవ్ స్పష్టం చేసిన దాని ప్రకారం, ఇది కేవలం ముసాయిదా మాత్రమే. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు హక్కునూ నోటీసు, విచారణ లేకుండా తొలగించబోమని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఆగస్టు నెల అంతా క్లెయిమ్‌లు, అభ్యంతరాల  స్వీకరణ ప్రక్రియ నడుస్తోంది. తమ పేరు పొరపాటున గల్లంతైతే ఫారమ్-6 సమర్పించి, సరైన ఆధారాలు చూపిస్తే అక్టోబర్ 3న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో మళ్లీ పేరు చేరుతుందని ఈసీ వెల్లడించింది.  ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో గ్రామీణ మరియు పట్టణ పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లను అలర్ట్ చేసిన కూటమి, వైఎస్సార్‌సీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలో రద్దయిన ఓట్ల జాబితాను రీ-వెరిఫై చేసే పనిలో పడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైనదే అయినందున, అసలైన ఓటర్లు తమ హక్కును కోల్పోకుండా చూసేందుకు పొలిటికల్ పార్టీలు డిజిటల్ క్యాంపెయిన్లు, డోర్-టు-డోర్ వెరిఫికేషన్లను ముమ్మరం చేశాయి.