Ration Card Cancellation SIR Process: భారతదేశంలో ఓటు హక్కు అనేది కేవలం ఐదేళ్లకు ఒకసారి మనకు నచ్చిన నాయకుడిని లేదా రాజకీయ పార్టీని ఎన్నుకునే ఒక ప్రక్రియ మాత్రమే అని చాలా మంది భావిస్తుంటారు.  మాకు రాజకీయాలు వద్దు.. ఓటు వేయకపోయినా పర్లేదు  అంటూ ఎన్నికల రోజున సెలవు దినంగా భావించి ఇళ్లకే పరిమితమయ్యే మధ్యతరగతి, సామాన్య వర్గాలు నేడు దేశంలో చాలా ఎక్కువ. అయితే, మారుతున్న సాంకేతిక యుగంలో ఓటు హక్కుపై నిర్లక్ష్యం వీడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ ఓటర్ ఐడీ   కేవలం ఎన్నికల గుర్తింపు కార్డు మాత్రమే కాదు.. మీ రేషన్ కార్డు, పెన్షన్, రైతు భరోసా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హతను శాసించే అత్యంత కీలకమైన పత్రంగా మారబోతోంది.  పశ్చిమ బెంగాల్ రేషన్ కార్డుల ఏరివేత 

Continues below advertisement

ప్రభుత్వాలు లబ్ధిదారుల వడపోత కోసం డేటాబేస్‌లను ఎలా వాడుతున్నాయో చెప్పడానికి పశ్చిమ బెంగాల్  ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలే ఒక నిదర్శనం. అక్కడ అర్హత లేని, బోగస్ , నకిలీ రేషన్ కార్డుదారులను ఏరివేసేందుకు ఆ రాష్ట్ర యంత్రాంగం  SIR   ఓటర్ డేటాబేస్‌లను ప్రామాణికంగా తీసుకుంటోంది. రేషన్ కార్డులో పేర్లు ఉండి, ఓటర్ జాబితాలో   లేని వారిని, లేదా అసలు ఓటు హక్కు లేని వారిని డిజిటల్ వడపోత ద్వారా గుర్తించి లక్షలాది బోగస్ కార్డులను రద్దు చేస్తున్నారు. బెంగాల్‌లో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య ఓటర్లకు ఒక పెద్ద కనువిప్పు లాంటిది.   ఒకే గొడుగు కిందికి పౌరుల సమాచారం!

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే కుటుంబానికి సంబంధించిన అన్ని రకాల అధికారిక డేటాబేస్‌లను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే డిజిటల్ విప్లవానికి   తెరలేపాయి. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన పాన్  కార్డును ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలతో అనుసంధానం చేసిన తరహాలోనే, ఇప్పుడు ఓటర్ ఐడీని కూడా ఇతర ముఖ్యమైన డేటాబేస్‌లతో అనుసంధానించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. దీనివల్ల ఒక పౌరుడి ఆర్థిక స్థితిగతులు, కుటుంబ వివరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి అంతా ఒకే క్లిక్‌తో అధికారుల స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. ఈ వ్యవస్థలో ఓటర్ ఐడీ అనేది ఒక కీలకమైన  యాంకర్ డేటా గా మారబోతోంది. 

Continues below advertisement

 ఓటు లేకపోతే సంక్షేమానికి ఎసరు! 

ఒక కుటుంబంలో అర్హులైన వయసు  ఉన్న పౌరులు ఉండి కూడా, ఓటర్ లిస్టులో వారి పేర్లు నమోదు కాకపోతే.. అది ప్రభుత్వ డిజిటల్ సిస్టమ్‌లో ఆ కుటుంబానికి సంబంధించిన సామాజిక-ఆర్థిక స్థితిగతులలో   తీవ్ర వ్యత్యాసాలను చూపిస్తుంది. భవిష్యత్తులో సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఏదైనా ఒక కఠినమైన నిబంధనను తీసుకువస్తే.. అందులో ఓటర్ ఐడీ చురుగ్గా లేకపోవడం లేదా ఓటర్ లిస్టులో పేరు లేకపోవడం అనేది మీ సంక్షేమ పథకాల తిరస్కరణకు  ఒక బలమైన సాంకేతిక కారణం కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే, ఓటు లేని పౌరుడిని సిస్టమ్  యాక్టివ్ సిటిజన్ గా గుర్తించని పరిస్థితి త్వరలోనే రానుంది. ప్రభుత్వం నుండి ఎలాంటి సబ్సిడీలు, రాయితీలు, లేదా లబ్ధి పొందాలన్నా ఓటర్ లిస్టులో మీ పేరు సజీవంగా ఉండటం ప్రాథమిక అవసరంగా మారుతోంది. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం అనేది కేవలం హక్కు మాత్రమే కాదు.. డిజిటల్ ఇండియాలో మీ కుటుంబ సంక్షేమానికి అదొక రక్షణ కవచం అని గ్రహించాలి.  ఓటర్ జాబితాను తనిఖీ చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత! 

పశ్చిమ బెంగాల్ రేషన్ కార్డుల వ్యవహారం భవిష్యత్తు ప్రభుత్వాల పనితీరుకు ఒక ముందస్తు సంకేతం. అందుకే సామాన్య ప్రజలు ఓటు హక్కుపై నిర్లక్ష్యం వీడాలి. SIR కార్యక్రమాల్లో పాల్గొని, తమ పేర్లు ఓటర్ లిస్టులో ఉన్నాయో లేదో సరిచూసుకోవడం, చిరునామాలు మారితే వెంటనే అప్‌డేట్ చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం.