AP Telangana Borrowings : అప్పుల్లేని(Debts) వారు అధిక సంప‌న్నులు! అన్నారు పెద్ద‌లు. కానీ, ఇది ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు ఈ మాట ఎక్క‌డా విన‌బ‌డ‌దు.. ఇలా ఉన్న‌వారు క‌న‌బ‌డ‌రు. చిన్నా.. పెద్దా.. ఎవ‌రిని త‌ర‌చి చూసినా.. అప్పులే అప్పులు. ఇటీవ‌ల పార్ల‌మెంటు(Parliament)లో ఓ స‌భ్యుడు మాట్లాడుతూ.. అభివృద్ధి లేని రాష్ట్రాలు ఉన్నాయేమో కానీ.. అప్పులు లేని రాష్ట్రాలు లేవు! అని వ్యాఖ్యానించారు. వ్య‌క్తుల నుంచి వ్య‌వ‌స్థ‌ల వ‌ర‌కు.. ఇప్పుడు అంద‌రూ ప‌ఠిస్తున్న ఏకైక మంత్రం `అప్పు`. అప్పు జీవితంలో వ్య‌క్తుల‌కు, పాల‌న‌లో ప్ర‌భుత్వాల‌కు ఒక భాగంగానే కాదు.. అవ‌స‌రంగా కూడా మారిపోయింది. 


ఏపీకి లాస్ట్ ఛాన్స్‌


ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ(YSRCP) ప్ర‌భుత్వం తాజాగా 4వేల‌ కోట్ల రూపాయ‌ల అప్పుల కోసం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. వ‌చ్చే మంగ‌ళ‌వారం.. ఆరోతేదీన జ‌రిగే వేలంలో పాల్గొని 4 వేల కోట్లు అప్పు చేయ‌నుంది. దీనిలో 1000 కోట్లు ఐదేళ్ల కాలానికి, 500 కోట్ల రూపాయ‌ల‌ను 12 ఏళ్ల కాలానికి, 1000 కోట్ల‌ను 15 ఏళ్ల కాలానికి, 500 కోట్ల‌ను 17 ఏళ్ల కాలానికి, మ‌రో 1000 కోట్ల‌ను 19 ఏళ్ల కాలానికి గ‌డువు పెట్టి అప్పు తీసుకురానుంది. చిత్రం ఏంటంటే.. వైసీపీ ప్ర‌భుత్వానికి ఇదే ఆఖ‌రి అప్పు. ఎందుకంటే.. ఫిబ్ర‌వ‌రిలో ఎప్పుడైనా ఎన్నిక‌ల నోటిఫికేషన్ రానుంది. దీంతో కోడ్ అమ‌ల్లోకి వ‌స్తే.. అప్పులు చేసేందుకు వీలుండ‌దు. మ‌రో విచిత్రం ఏంటే.. ఫిబ్ర‌వ‌రి 6న ఏపీలో ఓటాన అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెడుతున్న స‌మ‌యంలోనే అప్పులు చేయ‌డం. 


తెలంగాణ ఫ‌స్ట్ 


తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్పడిన కాంగ్రెస్(Congress) స‌ర్కారు.. మూడు మాసాలు కూడా గ‌డ‌వ‌కుండానే అప్పుల బాట ప‌ట్టింది. త‌మ‌కు 2 వేల కోట్ల‌రూపాయ‌లు కావాలంటూ.. ఆర్బీఐకి ఇండెంట్ పంపించింది. దీనిని కూడా.. 1000 కోట్ల రూపాయ‌ల‌ను 11 ఏళ్ల కాలాని, మ‌రో 1000 కోట్ల‌ను ఏకంగా 21 ఏళ్ల కాలానికి తీరుస్తామ‌ని పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఆర్బీఐని ఆశ్ర‌యించింది. ఇక్క‌డ కూడా మ‌రో చిత్రం ఉంది.. ఆర్బీఐ వ‌ద్ద అప్పులు చేసే స‌మ‌యానికి అదేరోజు అంటే.. ఫిబ్ర‌వ‌రి 6నే తెలంగాణ‌లో పూర్తిస్తాయి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. సో.. ఇదీ.. సంగ‌తి!!


ఎన్టీఆర్ కాలంలో ఏం జ‌రిగింది?


అది.. 1984వ సంవ‌త్స‌వ‌రం. ఉమ్మ‌డి ఏపీ(AP)లో ఎన్టీఆర్(NTR) పాల‌న సాగిస్తున్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న రూ.2కే కిలో బియ్యం(Rice) ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని సంక‌ల్పించారు. ఆ స‌మ‌యంలో ఆర్థిక మంత్రిగా ప్ర‌స్తుత టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu naidu) ఉన్నారు. ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు దోహ‌ద ప‌డ‌ద‌ని, కాబ‌ట్టి.. అప్పులు చేయాల్సి వ‌స్తుంద‌ని సీఎం రామారావుకు చెప్పారు. కానీ, దీనిని ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. అయిన‌ప్ప‌టికీప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌ని భావించారు. ఈ క్ర‌మంలో కేంద్రం నుంచి ఇన్‌సెటివ్స్ తెచ్చుకునేందుకు ఢిల్లీ వెళ్లి.. కేంద్రాన్ని గ‌ద్దించి మరీ నిధులు తెచ్చుకున్నారు. అంటే.. అప్పుల‌కు అప్ప‌టి పాల‌కుడుగా రామారావు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. `అప్పులు చేసి ఎన్నాళ్లు ప‌ప్పు కూడు తింటాం బ్ర‌ద‌ర్‌`` అని స‌భ సాక్షిగా ఆయ‌న కాంగ్రెస్ ను ఏకేశారు. 


కేంద్ర‌మే ప్రోత్స‌హిస్తోంది..


క‌ట్ చేస్తే.. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ(BJP) పాలిత రాష్ట్ర‌మైనా.. అప్పుల వైపే అడుగులు వేయాల్సిన ప‌రిస్థితి.. సంస్క‌ర‌ణ‌ల రూపంలో కేంద్రం ద‌శాబ్దం కింద‌టే తీసుకువ‌చ్చింది. కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌ను పెంచుకుని పోతున్న త‌రుణంలో రాష్ట్రాల‌కు ఇచ్చే ఇన్‌సెంటివ్స్‌ను త‌గ్గించేసి..అప్పులు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఇది ఎంత‌లా అంటే.. తాము ప్ర‌వేశ పెడుతున్న సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేసే రాష్ట్రాల‌కు విరివిగా అప్పులు తెచ్చుకునేందుకు అనుమ‌తి ఇచ్చేంత‌గా! 


సంస్క‌ర‌ణ‌ల పేరుతో


ఈ క్ర‌మంలోనే ఏపీ(AP)లో చెత్త‌పై ప‌న్ను(Garbage Tax), రైతుల విద్యుత్‌కు మీట‌ర్లు, వాట‌ర్‌కు మీట‌ర్లు వంటివి వ‌చ్చాయి. అప్ప‌ట్లో తెలంగాణ మంత్రిగా ఉన్న హ‌రీష్ రావు.. ఈ విష‌యాన్ని ప‌బ్లిక్‌గానే దునుమాడారు. అప్పుల కోసం.. రైతుల ప్రాణాల‌కు ఉరి బిగించ‌మ‌ని చెప్పారు. ఇలా.. రాష్ట్రాలు అప్పులు చేసుకునే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని క‌దిపినా.. అప్పుల‌తో కుస్తీలు ప‌డ‌డ‌మే కాదు.. పక్క‌రాష్ట్రాల‌తో పోటీ కూడా ప‌డుతున్నాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం, తెలంగాణ ప్ర‌భుత్వం రెండూ కూడా అప్పుల బాట ప‌ట్టాయి.