TDP Janasena Fan Wars:  ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిపాలనను గాడిలో పెడుతున్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న డిజిటల్ సమరం కూటమి అగ్రనేతలకు పెద్ద తలనొప్పిగా మారింది. విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్‌సీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు ఒకే తాటిపై నడిచిన ఈ రెండు పార్టీల కార్యకర్తలు, మద్దతుదారులు.. ఇప్పుడు ప్రభుత్వం సాధిస్తున్న విజయాంశాలను డిజిటల్లోకి తీసుకెళ్లడం పక్కనపెట్టి ఎక్స్ , ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. మా వల్లే అధికారంలోకి వచ్చాం  అని కొందరు,  మా నాయకుడికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదు  అని మరికొందరు చేసుకుంటున్న వ్యాఖ్యలు కూటమికి పెద్ద సెల్ఫ్ గోల్‌గా మారుతున్నాయి.

Continues below advertisement

 అధికారిక హ్యాండిల్స్ vs స్వతంత్ర సోషల్ మీడియా సైన్యాలు 

ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే.. ఈ సోషల్ మీడియా యుద్ధాల్లో పాల్గొంటున్న వారిలో మెజారిటీ నెటిజన్లు పార్టీ అధికారిక డిజిటల్  విభాగాల   కింద పనిచేసేవారు కాదు. వీరంతా సొంతంగా పేజీలు, హ్యాండిల్స్ నడుపుతున్న స్వతంత్ర మద్దతుదారులు, ఫ్యాన్ గ్రూపులు. దీంతో వారిని నేరుగా నియంత్రించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం పార్టీ అగ్రనాయకత్వానికి సాధ్యపడటం లేదు. ఒక చిన్న వివాదాస్పద పోస్ట్ లేదా వ్యాఖ్య నిమిషాల్లో వైరల్ అయి, ఇరువర్గాల మధ్య వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారడం, దాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకోవడం పరిపాటిగా మారింది.

Continues below advertisement

 దారి మళ్లుతున్న ప్రచారం 

కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్ల పెంపు, సూపర్ సిక్స్ హామీల అమలు, అమరావతి, పోలవరం పనుల వేగవంతం వంటి  కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే, సోషల్ మీడియాలో నిరంతరం జరుగుతున్న ఈ  ఫ్యాన్ వార్స్  వల్ల ఈ విజయాల కంటే ఇరు పార్టీల మధ్య ఉన్నట్లుగా కనిపిస్తున్న వైరుధ్యాలే  ఎక్కువ ప్రచారాన్ని పొందుతున్నాయి. ఇది ప్రభుత్వం సాధిస్తున్న సానుకూల వాతావరణాన్ని  దెబ్బతీయడమే కాకుండా, సాధారణ ఓటర్లలో ఒక రకమైన గందరగోళానికి దారితీస్తోంది.

 కూటమి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం ఎలా? 

ఈ పరిణామాన్ని అరికట్టడానికి కూటమి నాయకత్వం తక్షణమే కొన్ని కీలక చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది.  చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ఇద్దరూ తమ మద్దతుదారులకు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు.  పరస్పరం దాడి చేసుకునే హ్యాండిల్స్ తమ పార్టీకి ప్రాతినిధ్యం వహించవని, అలాంటి వారిని ప్రోత్సహించవద్దని బహిరంగంగానే సంకేతాలు ఇస్తున్నారు.   స్వతంత్ర హ్యాండిల్స్‌కు వైసీపీ వైఫల్యాలను నిలదీసేలా లేదా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రచారం చేసేలా ఆసక్తికరమైన సమాచారం   క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచేందుకు సమన్వయం చేసే ప్రయత్నిస్తున్నారు.  వారి ఎనర్జీని ప్రత్యర్థి పార్టీల వైపు మళ్లించేలా కొత్త టార్గెట్‌లను సెట్ చేసే వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్నారు. 

 రాబోయే రోజుల్లో ఎదురయ్యే ముప్పు 

మరో రెండు మూడేళ్లలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీల శ్రేణుల మధ్య ఉండాల్సిన ఐక్యతను సోషల్ మీడియా విభేదాలు దెబ్బతీస్తే, అది ప్రత్యర్థి పార్టీ వైఎస్‌ఆర్‌సీపీకి ఊహించని రాజకీయ లబ్ధిని చేకూరుస్తుంది. కాబట్టి ఈ డిజిటల్  ఫ్రెండ్లీ ఫైర్ ను వెంటనే అరికట్టకపోతే పొలిటికల్ ప్రాపగండాలో కూటమి వెనుకబడే ప్రమాదం ఉంది. రాజకీయాల్లో విజయం సాధించడం ఎంత ముఖ్యమో, సాధించిన విజయాలను కాపాడుకుంటూ ఐక్యతను ప్రదర్శించడం అంతకంటే ముఖ్యం. సాంకేతికత పెరిగిన కాలంలో సోషల్ మీడియా స్పేస్ అనేది కేవలం వినోదం కాదు. అది ప్రజాభిప్రాయాన్ని నిర్మించే ప్రధాన ఆయుధం. టీడీపీ-జనసేన అగ్రనేతలు వెంటనే స్పందించి ఈ డిజిటల్ ఘర్షణలకు స్వస్తి పలికిస్తేనే కూటమి ఇమేజ్‌కు జరిగే డ్యామేజ్‌ను సమర్థవంతంగా అరికట్టవచ్చు. లేకపోతే నష్టం ఖాయమే అనుకోవచ్చు.