AP 12th PRC Interim Relief Agitation: ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మళ్లీ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సదుపాయాలు, పెండింగ్ బకాయిల పరిష్కారానికి సమయం ఇచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడు తమ ప్రధాన డిమాండ్ల సాధనకు సమరశంఖం పూరిస్తున్నారు. 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి ప్రకటన, నిలిచిపోయిన కరువు భత్యం బకాయిల విడుదలపై కాలయాపన జరుగుతోందంటూ ఏపీ ఎన్జీవో , ఏపీ జేఏసీ అమరావతి వంటి ప్రధాన సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ, తమ ఆర్థిక, సర్వీసు హక్కుల సాధన కోసం ఇకపై ప్రత్యక్ష పోరాటాలు తప్పవని ఉద్యోగ నాయకులు హెచ్చరిస్తున్నారు. పీఆర్సీ చైర్మన్ ను నియమించాలంటున్న ఉద్యోగ సంఘాలు
ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్న డిమాండ్లలో 12వ పీఆర్‌సీ చైర్మన్‌ను తక్షణమే నియమించడంతో పాటు వేతన వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు వీలుగా తక్షణ ఐఆర్‌ను ప్రకటించడం అత్యంత కీలకమైనవిగా మారాయి. వీటితో పాటు పాత పెన్షన్ విధానం అమలు లేదా సీపీఎస్, జీపీఎస్ వివాద పరిష్కారం, ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్స్ బగ్గుమంటున్న లోపాలు, ఒప్పంద, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెంపుదలలు ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించిన వేళ, ఏపీలో స్పష్టమైన గడువు లేకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనాన్ని నింపుతోంది.
నిరసనల షెడ్యూల్ ప్రకటించిన ఉద్యోగ సంఘాలు
ఈ నిరసనలపై ప్రభుత్వం తరఫున ప్రతిస్పందనలు వెలువడుతున్నాయి. ఇటీవల ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దాదాపు 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా సమావేశమై వారి 50కి పైగా డిమాండ్లను ఆలకించింది. పెండింగ్ బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని, పీఆర్‌సీ, ఐఆర్ విజ్ఞప్తులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, గత ప్రభుత్వం వదిలివెళ్లిన భారీ ఆర్థిక లోటు, రూ. వేల కోట్ల పెండింగ్ బిల్లుల భారం కారణంగా వెంటనే నిధులు కేటాయించడం ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. రాజకీయ సమీకరణాల పరంగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగుల పాత్ర అత్యంత నిర్ణయాత్మకమైనది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పీఆర్‌సీ అమల్లో జాప్యం, పోలీసు కేసుల నమోదు, పెండింగ్ బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ వర్గాలు కూటమి వైపు మొగ్గు చూపాయి. ప్రస్తుతం అదే ఉద్యోగులు మళ్లీ రోడ్డెక్కితే అది కూటమి ప్రభుత్వ రాజకీయ ఇమేజ్‌కు పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం సామరస్యంగా ఇరువర్గాల మధ్య చర్చల ప్రక్రియను నిరంతరం కొనసాగించే ప్రయత్నం చేస్తోంది.
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఈ ఉద్యోగ సంఘాల నిరసనలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికల ముందు ఉద్యోగులకు అసంఖ్యాక హామీలు ఇచ్చిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక పీఆర్‌సీ, ఐఆర్ ఊసెత్తడం లేదు అని ఉద్యోగ సంఘాల డిమాండ్లకు మద్దతు ఇస్తూ, వారి నిరసనల ఆధారంగా రాజకీయాంశంగా మార్చేందుకు ప్రతిపక్షం వ్యూహరచన చేస్తోంది. ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమం కేవలం ఒక సర్వీసు డిమాండ్ల పోరాటంగా కాకుండా రాష్ట్ర రాజకీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేసే శక్తిగా రూపాంతరం చెందుతోంది. ఆర్థిక సంక్షోభం ఒకవైపు, ఉద్యోగుల ఆకాంక్షలు మరోవైపు ఉన్న తరుణంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మకంగా త్వరితగతిన పీఆర్‌సీ కమిషన్‌ను ప్రకటించి, కొంతమేర ఐఆర్‌ను కేటాయించడం ద్వారా మాత్రమే ఈ ఆందోళనల జ్వాలలను చల్లార్చగలదన్నఅంచనాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది?
