Nara Lokesh DSC Debate Challenge AP Assembly: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ వర్షాకాల సమావేశాలతో కొత్త మలుపు తిరగనుంది.  ఇటీవల కాలంలో అధికార కూటమి  ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సమరశంఖం పూరిస్తూ వరుస ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. అందులో ముఖ్యంగా మెగా డీఎస్సీ  నియామకాలపై అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయంటూ నిర్వహించిన నిరసనలు,  సమావేశాలు, రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లో పోరాడిన వైఎస్సార్‌సీపీకి,  అభియోగాల్లో నిజాయితీ ఉంటే   అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రత్యక్ష చర్చకు దిగాలి  అని అధికార పక్షం విసిరిన చాలెంజ్ ఇప్పుడు ప్రధాన రాజకీయ పరీక్షగా మారింది.

Continues below advertisement

ఫలించని వైసీపీ న్యాయపోరాటం

మెగా డీఎస్సీ వివాదంపై పారదర్శకమైన చర్చ జరపాలనే విజ్ఞప్తులతో వైఎస్సార్‌సీపీ నేతలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని  ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసిపుచ్చడం ప్రతిపక్షానికి ఊహించని చట్టపరమైన షాక్‌గా మారింది. రాజకీయ లబ్ధి కోసం వేసే పిల్‌లను అనుమతించలేమని న్యాయస్థానం స్పష్టం చేయడంతో, ఈ అంశాన్ని న్యాయపోరాటం కంటే సభా వేదికగానే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తమ పారదర్శకతను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతుండటంతో, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ వేదికను వాడుకుంటుందా లేదా అనే అంశంపై సోషల్ మీడియా, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.

Continues below advertisement

వైసీపీ హాజరవుతుందా? 

అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో వైఎస్సార్‌సీపీ ముందున్న అతిపెద్ద సవాలు ప్రతిపక్ష హోదా  గుర్తింపు  . తగినంత సంఖ్యాబలం లేదన్న కారణంతో స్పీకర్ స్థానం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీ గత సమావేశాలను బహిష్కరించింది. అయితే, ఇప్పుడు డీఎస్సీ వంటి అత్యంత ప్రజాదరణ పొందిన ఉద్యమం చేతిలో ఉండటంతో, నిరసనను సభ బయటకే పరిమితం చేస్తే..  ప్రభుత్వ సవాల్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే వైఎస్సార్‌సీపీ పారిపోయింది  అని అధికార పక్షం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.మరోవైపు, అధికార కూటమి నేతలు సైతం శాసనసభ వేదికగా ప్రతిపక్షాన్ని గణాంకాలతో నిలదీసేందుకు పక్కా నివేదికలతో సిద్ధమవుతున్నారు.   తమ ప్రభుత్వంలో కల్పించిన ఉద్యోగ అవకాశాలు, స్పోర్ట్స్ కోటా పరిశీలన పద్ధతులను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సభ ముందు ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. 

వైసీపీ సభకు వస్తే అన్ని అంశాలపై చర్చలు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తే డీఎస్సీతో పాటు శాంతిభద్రతల అంశం, ఇటీవల ఎమ్మెల్యేల అరెస్టుల వ్యవహారాలపై ఉభయ పక్షాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ ముందు ప్రస్తుతం రెండు మార్గాలు మిగిలాయి. మొదటిది, పాత పద్ధతిలోనే సభా బహిష్కరణ కొనసాగించడం,  రెండవది, నిరసన ముద్రను దాటుకుని సభా వేదికపైకి వచ్చి స్పీకర్ స్థానాన్ని ప్రశ్నిస్తూనే డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్‌ను నేరుగా నిలదీయడం. ఈ రెండింటిలో వైఎస్సార్‌సీపీ ఎంచుకునే వ్యూహం రాబోయే రోజుల్లో ఆ పార్టీ పొలిటికల్ మైలేజ్‌ను నిర్ణయించనుంది. ఈ అవకాశాన్ని వైఎస్సార్‌సీపీ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో లేక వీధిపోరాటాలకే తన వ్యూహాన్ని పరిమితం చేస్తుందో తెలియాలంటే ఈ నెల 17 వరకు వేచి చూడాల్సిందే. 2029 ఎన్నికల రేసులో ప్రధాన ప్రతిపక్షంగా తమ ఉనికిని మరింత బలంగా చాటుకోవడానికి వైఎస్సార్‌సీపీకి ఒక సువర్ణావకాశం అని చెప్పవచ్చు. వీధి పోరాటాల నుంచి శాసనసభ సభా వేదికకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లడమే ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీకి ఎక్కువ పొలిటికల్ అడ్వాంటేజ్‌ను తెచ్చిపెడుతుందని రాజకీయ వర్గాల అంచనా.