AP Assembly to meet again in special session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను రాబోయే 10 రోజుల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అమరావతి వేదికగా జరిగిన టెలి కాన్ఫరెన్స్‌లో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , కీలక నేతలతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, దానిపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై చర్చలు నిర్వహించే అవకాశం ఉంది.  మహిళా బిల్లుకు సంబంధించి కాంగ్రెస్ మినహా మిగిలిన అన్ని పక్షాలు సానుకూలత వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Continues below advertisement

 ముగ్గురు నేతలతో కీలక కమిటీ ఏర్పాటు 

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం,  విపక్షాలు చేసిన ద్రోహంపై  రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం ,  కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఇందులో టీడీపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ తరఫున పీవీఎన్ మాధవ్,  జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్‌ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలను రూపొందించనున్నారు.

Continues below advertisement

 నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు.. బహిరంగ సభలు 

ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి, మహిళా రిజర్వేషన్ బిల్లు  ప్రాముఖ్యతను,  కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికి తోడు, రాబోయే రోజుల్లో విశాఖపట్నం, విజయవాడ,  తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించాలని టెలి కాన్ఫరెన్స్‌లో నిర్ణయించారు. ఈ సభల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా, ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టంగా వివరించనున్నారు.

సమన్వయంతో ముందుకు వెళ్లాలని పిలుపు 

అసెంబ్లీ సమావేశాల్లో   ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. టీడీపీ, జనసేన, మరియు బీజేపీ నేతలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా మహిళా సాధికారత దిశగా తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల మద్దతు కూడగట్టాలని సూచించారు. 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.