ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్న జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్‌, జమిలీ ఎన్నికల కసరత్తు వేళ... సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది.


ఏపీలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసి... రిమాండ్‌కు కూడా పంపారు. చంద్రబాబు అరెస్ట్‌ అక్రమమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గవర్నర్‌ అనుమతి కూడా తీసుకోలేదని మండపడుతున్నారు. మరోవైపు... చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ ఎంపీలు ఇప్పటికే రాష్ట్రపతికి, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు పట్ల నియంతలా వ్యవహరించిందని.. పోలీసులు, సీఐడీ అధికారులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసులు పెట్టి వేధిస్తున్నారని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు టీడీపీ ఎంపీలు.


మరోవైపు.. ఈనెల 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు, యూసీసీ, మహిళా బిల్లులను ఆమోదం పొందేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్రం NDA పక్షాలతో పాటుగా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోరుకుంటోంది. 


పార్లమెంట్‌లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలోని 543 స్థానాల్లో 67 శాతం మద్దతు దక్కాలి. దీంతో పాటుగా రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్ధించాలి. దీంతో పాటుగా దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదముద్ర వేయాలి. లోక్‌సభలో బీజేపీకి 333 సీట్ల ఉన్నందున  61 శాతం మద్దతు ఉన్నట్టే. కానీ.. బిల్లు ఆమోదానికి మరో 5 శాతం ఓటింగ్ అవసరం. లోక్‌సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో చూసుకున్నా... 38 శాతం ఎన్డీఏ కూటమికి మద్దతు ఉంది. అక్కడా వైసీపీ మద్దతు అవసరం. రాజ్యసభలో వైసీపీకి ఉన్న తొమ్మిది మంది సభ్యులు బిల్లుల ఆమోదానికి కీలకంగా మారారు. ఇక, బీజేపీ పది రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఈ బిల్లులు ఆమోదం పొందాంటే 14 రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. ఆ సమయంలోనూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం కీలకం కానుంది. 


పార్లమెంట్‌లో ఇప్పటివరకు ఎన్టీయే సర్కార్‌ తీసుకొచ్చిన బిల్లులకు వైఆర్‌ఎస్‌సీపీ మద్దతు ఇచ్చింది. వర్షాకాల సమావేశాల్లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు కూడా వైసీపీ అండగా నిలిచింది. అయితే.. ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ సర్కార్‌ ప్రవేశపెట్టబోతున్న కీలక బిల్లులకు మద్దతు ఇచ్చే అంశంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అటు.. చంద్రబాబు అరెస్ట్‌... ఇటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఎన్డీయే సర్కార్‌ ప్రవేశపెట్టనున్న బిల్లుల మద్దతు...  ఈ క్రమంలో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ ఏయే అంశాలపై  చర్చిస్తారన్న దానిపై... రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.