Andhra Early Polls :   ముందస్తు ఎన్నికల గురించి ఏపీలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే ముందే ఎన్నికలకు వెళ్లడానికి తామేం పిచ్చోళ్లం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు. కానీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఎన్నికలను ఎదుర్కోవడానికన్నట్లుగానే ఉన్నాయి. మరో ఐదారు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోవడానికి అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తాయో అన్నీ ఆయన చేస్తున్నారు.  జిల్లాలు పర్యటిస్తున్నారు.. పార్టీ నేతల్ని గడప గడపకూ  పంపుతున్నారు.. అధికార యంత్రాంగాన్ని ఎన్నికలకు  తగ్గట్లుగా ప్రక్షాళన చేస్తున్నారు. ఎలా చూసినా.. ముందస్తు ఎన్నికల సన్నాహాలేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. 


ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లడం మంచిదని పీకే టీం సలహా ?


 మరోసారి గెలవాలంటే తప్పకుండా ముందస్తు ఎన్నికలు వెళ్లాలని జగన్ గట్టిగా నమ్ముతున్న ప్రశాంత్ కిషోర్ టీం సలహా ఇచ్చిందని వైసీపీలో కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.అందుకే జగన్ ముందస్తు సన్నాహాలు ప్రారంభించారని చెబుతున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్‌ అనుసరించిన విధానాన్నే పాటిస్తూ.. షెడ్యూల్‌ కన్నా ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లాలని.. వైసీపీ అధినేత జగన్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సన్నాహకంగా ఈ నవంబర్‌ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కూడా పీకే టీమ్‌ సర్వే మొదలుపెట్టింది.  గడప గడపకు కార్యక్రమం వల్ల   ఎమ్మెల్యేల్లో ప్రజల పట్ల ఉన్న స్పందనను తెలుసుకుంటున్నారు.  కొందరు ఎమ్మెల్యేలు ప్రజల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్నారు. వీరందరి జాబితాను పీకే టీమ్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 


ముందుగానే అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్న జగన్ !


రానున్న ఎన్నికల్లో ఎవరికి అవకాశం వస్తుంది.. ఎవరికి అవకాశం రాదన్న దానిపై వైసీపీ అధినేత ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నారు. ప్రత్యామ్నాయ నేతల్ని ప్రోత్సహిస్తున్న చోట..  వారే అభ్యర్థులు. నియోజకవర్గాల సమీక్షల్లో జగన్ ఈ విషయాన్ని నేరుగానే ప్రకటిస్తున్నారు. టెక్కలి వంటి చోట్ల వర్గ పోరు ఉన్నా అభ్యర్థిని ఖరారు  చేశారు.  అధిష్టానం వైఖరి ఏంటన్నది ఇప్పటికే నియోజకవర్గాల్లో అగ్రశ్రేణి నాయకత్వానికి అర్థం అయిపోయినట్లుంది. అందుకే ఎవరు ఉంటారో ఎవరు పోతారో అంతా అధినేత‌ ఇష్టం అంటూ నాయకులు వరుసగా హింట్లు ఇస్తూనే ఉన్నారు… అటు అధినేత జగన్‌ కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఎవరూ తమకు టికెట్ ఖాయం అనే భావనలో ఉండొద్దని…   జగన్‌ స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి మంచిమార్కులు తెచ్చుకున్నవారికే టికెట్‌ అంటూ కుండబద్ధలు కొట్టేశారు.  


ఎన్నికల సన్నాహాల నిర్ణయాలు ! 
 
ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ముందస్తు ఊహాగానాలకు మరింత ఊతమిస్తున్నాయి.  ఇందులో భాగంగానే ఆయన గడప గడపకు మన ప్రభుత్వం, సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తాజాగా బీసీ నేతలతో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించబోతున్నారు.   ప్రతిపక్షాల పొత్తు రాజకీయాలకు.. ముందస్తు ఎన్నికల ద్వారా బ్రేక్ వేయాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. జనసేనతో టీడీపీ కలిస్తే.. బీజేపీ దూరంగా ఉంటుందని భావిస్తున్న జగన్.. ప్రభుత్వ వ్యతిరేకత చీలి విజయం దక్కిందనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈసారి టీడీపీ గెలుపును అడ్డుకుంటే భవిష్యత్తులో తిరుగుండదనేది జగన్ ఆలోచనగా భావిస్తున్నారు. అందుకే విధేయులైన అధికారుల్ని కీలకమైన పోస్టుల్లో నియమిస్తున్నారు. పోలింగ్ రోజున అధికార యంత్రాంగం కలసి వచ్చేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. విమర్శలు వస్తున్నా ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేశారనే విమర్శలువచ్చినా డీఎస్పీ పోస్టింగ్‌లు ఇచ్చినతీరే దీనికి నిదర్శనం అంటున్నారు. 


వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో ఉండొచ్చని ఎక్కువ మంది నమ్మకం ! 


షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ గంట కొట్టేస్తారని అంచనా.. బహుశా వచ్చే ఏడాది ఏప్రిల్ ..మే సమయంలో ఉండవచ్చని కొన్ని వర్గాల విశ్లేషణ. ముందస్తు ఎన్నికల సన్నాహంలో భాగంగానే ఈమధ్య జగన్ పథకాల వేగం పెంచారు. ఉచితాలు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు మూడు రాజధానుల మూడుముక్కలాట  జోరు కూడా పెరిగింది. అధికారపార్టీ ఈ సన్నద్ధతలో భాగంగా తన వ్యూహాలు పటిష్టం చేసుకోవడంతో పాటు ప్రతిపక్షాల జోరు పెరగకుండా పగ్గాలు వేసే పనిలో కూడా గట్టిగా నిమగ్నం అయింది.ఒక పక్క తెలుగుదేశం నుంచి నాయకులను ఆకర్షించే వ్యూహాలు అమలు చేస్తూనే, మరో పక్క పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్లెం వేయడంపై ఎక్కువ దృష్టి పెడుతోంది అధికార పార్టీ. ప్రస్తుత పరిణామాలు దీన్నే నిర్ధారిస్తున్నారు. మరి జగన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో... అసెంబ్లీ  రద్దు చేసే వరకూ తెలియదు. ఎందుకంటే... ఈ ముందస్తు వ్యూహం ఎంత సీక్రెట్‌గా ఉంచుకుంటే.. అంత ప్రయోజనమని ఆయనకూ తెలుసు.