Telangana Politics: ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌కి చంద్రబాబు బూచి పట్టుకున్నట్టు అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా తెలంగాణకు సంబంధించిన నేతలు చంద్రబాబును ఒక సాకుగా చూపిస్తూ తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వరుసగా స్టేట్‌మెంట్స్ ఇస్తూ వస్తున్నారు. పైకి మామూలు కామెంట్స్‌లా కనిపిస్తున్నా నిజానికి వీటి వెనక ఆయా పార్టీల పెద్ద వ్యూహమే కనిపిస్తోంది అంటున్నారు ఎనలిస్ట్ లు.

నీటి ప్రాజెక్ట్‌లపై చంద్రబాబుతో యుద్దానికి సిద్ధం : రేవంత్ రెడ్డి తెలంగాణకు చెందిన పాలమూరు రంగారెడ్డి ప్రాజక్ట్‌కు 45 టీఎంసీల నీటి కేటాయింపుపై అభ్యంతరం చెబుతున్న ఏపీ మరోవైపు బనకచర్ల కట్టుకుంటామని చెప్పడమేంటని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంతో భాగస్వామిగా ఉన్నంత మాత్రాన తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా పోరాడతామని రేవంత్ రెడ్డి సహా మంత్రులు పవర్ పాయింట్ ప్రజంటేషన్‌తో వివరించే ప్రయత్నం చేశారు. ఒకవైపు బనకచర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగదు, కేవలం వరద సమయంలో గోదావరి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని చంద్రబాబు చెబుతున్నా తెలంగాణ సీయం మాత్రం పదేపదే బనకచర్లపై అభ్యంతరాలు చెబుతున్నారు.

చంద్రబాబు గోదావరిని దోచుకెళ్లిపోతున్నారు:బీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్ వాదన మరోలా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వారు ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గోదావరి నీటిని ఏపీకి దోచుకెళ్ళి పోవాలని చూస్తున్నా రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఘాటుగా స్పందిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌రావు ఎన్నిక వెనుక చంద్రబాబు ప్రభావం ఉందని BRS సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి. డీకే అరుణ, ఈటెల రాజేందర్, రాజా సింగ్ లాంటి వాళ్ళను పక్కనబెట్టి చంద్రబాబు అనుకూలుడైన రామచందర్‌రావుకి ఆ పదవి ఎలా ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి చంద్రబాబు రామచంద్రరావు మధ్య అలాంటి సాన్నిహిత్యం ఉన్నట్టు కనిపించదు.

నాలుగేళ్లు గడిస్తే చంద్రబాబు లేవలేడు: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిబిజెపి కూడా తెలంగాణలో చంద్రబాబు ముద్ర పడకుండా ఉండడం కోసం తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. నాలుగేళ్లు గడిస్తే చంద్రబాబు ఇంట్లోంచి లేవలేడని అలాంటప్పుడు ఆయన ప్రభావం తమపై ఎందుకు ఉంటుందని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గట్టిగా విమర్శించారు. తమ పార్టీకి అధ్యక్షుడ్ని నియమించాలంటే చంద్రబాబు సాయం తీసుకోవాల్సిన అవసరం లేదని తమ అధిష్టానానికి లేదని కిషన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు వాళ్లు చెబుతూ వస్తున్నారు.  

తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారు : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని కాంట్రాక్టులు ప్రాజెక్టులు అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపించడం తాజాగా సంచలనమైంది. మంచిగా చెబితే వాళ్ళు మాట వినరని అలాంటి వాళ్లకు నల్లా కనెక్షన్లు, కరెంట్ కనెక్షన్‌లూ కట్ చేయాలని తీవ్రమైన విమర్శలు చేశారాయన.

చంద్రబాబు చుట్టూ తెలంగాణ పాలిటిక్స్- రీజన్ అదేవిచిత్రంగా పార్టీలకు అతీతంగా అందరూ చంద్రబాబుని తెలంగాణలో టార్గెట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీని వెనుక తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్ళీ పైకి తీసుకువచ్చి ఓటర్ పోలరైజేషన్ చేయడం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నంగా ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. త్వరలో తెలంగాణలో జిహెచ్ఎంసి లాంటి ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ సెటిలర్ల ఓట్లు పార్టీల వారీగా చీలిపోయినా తెలంగాణ ఓటింగ్ మాత్రం తమకే దక్కాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. ఇటీవల చంద్రబాబు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో తెలంగాణలో పోటీ చేసే అంశంపైన దృష్టి పెడుతున్నట్టు తెలిపారు. దానితో అలర్ట్ అయిన తెలంగాణ పొలిటికల్ పార్టీలు ముందుగానే తెలంగాణ ఓటర్లను తమవైపు ఆకర్షించడం కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే జరుగుతున్న ప్రతి రాజకీయ పరిణామాన్ని చంద్రబాబుతో ముడిపెట్టి లబ్ధి పొందాలని తెలంగాణలోని పొలిటికల్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఇంకెన్ని మలుపులకు దారి తీస్తాయో చూడాలి.