Singhaiah family met Jagan: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం కలిసింది. తాడేపల్లిలోని జగన్ ఇంటికి వైసీపీ నేతలు సింగయ్య కుటుంబాన్ని తీసుకు వచ్చారు. వారికి జగన్ ఓదార్పు మాటలు చెప్పారు. తాను అండగా ఉంటానన్నారు.
బయటకు వచ్చిన సింగయ్య భార్య లూర్దూమేరీ తన భర్త సింగయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రకటించారు. నా భర్తను అంబులెన్స్ లో ఎవరో ఏమో చేశారు, అందుకే చనిపోయి ఉంటాడని మాకు అనుమానంగా ఉందన్నారు. చిన్న చిన్న గాయాలకే మా ఆయన ఎలా చనిపోతాడు? .సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నారు. అప్పటివరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్ గా ఎలా చనిపోతాడని ఆమె ప్రశ్నించారు. కొందరు వైసీపీ వాళ్లు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్దాం అంటే వద్దని అంబులెన్స్ లోనే తీసుకెళ్లారని ఆరోపించారు.
మనుషుల్ని చంపేసి .. డ్రామాలాడుతున్నారని సింగయ్య భార్యను పిలిపించుకుని అలా చెప్పించారని సీఎం చంద్రబాబు కుప్పంలో విమర్శించారు. తన జీవితంలో ఇన్ని రాజకీయ డ్రామాలు ఎప్పుడూ చూడలేదన్నారు. హత్యా రాజకీయాలు చేస్తూ.. తప్పుడు పనులు చేసే వారి గురించి ప్రజలే ఆలోచించాలన్నారు.
సింగయ్య భార్య ఆస్పత్రిలో బాగా మాట్లాడారని చెప్పారు. మళ్లీ అంబులెన్స్ లో ఏదో చేశారని చెప్పారు. ఈ విషయాలను టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నించారు. దళిత కుటుంబం పెద్ద మరణానికి కారణమవడమే కాకుండా ఇప్పుడు ఆయన భార్యతోనూ రాజకీయాలు చేయించి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య ఎవరి కారు కింద పడి చనిపోయారన్న సంగతి మొదట్లో స్పష్టత లేదు. జగన్ ర్యాలీ వెళ్లిపోయిన తరవాత రోడ్డు పక్కన డివైడర్ చెట్ల పక్కన ఆయనను పడేసి వెళ్లిపోయారు. తర్వాత పోలీసులు అంబులెన్స్ ను పిలిపించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో చనిపోయారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి జగన్ కాన్వాయ్ లోని కారు కాదని.. వేరే కారు ఢీకొట్టిందని కారు నెంబర్ కూడా ప్రకటించారు. తన కారు ఢీకొట్టిందని జగన్ కూడా ప్రకటించలేదు. వైసీపీ నేతలు కూడా ప్రకటించలేదు. ఐదు రోజుల తర్వాత వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత జగన్ ఒప్పుకున్నారు. తన కారు కిందే పడ్డారని అందుకే తర్వాత రోజు పది లక్షల సాయం చేయమని ఆదేశించానని చెప్పారు. అసలు జగన్ కారు కింద పడిన విషయం వీడియోలు వచ్చే వరకూ చెప్పని వైసీపీ నేతలు.. ఇప్పుడు .. కుటుంబసభ్యులను జగన్ ఇంటికి పిలిపించుకుని .. మీడియాతో అలా చెప్పించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.