AP CM Chandrababu Comments On Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు (Jamili Elections) వచ్చినా రాష్ట్రంలో మాత్రం షెడ్యూల్ ప్రకారం 2029లోనే సాధారణ ఎన్నికలు ఉంటాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. ముందస్తు ఎన్నికలేవీ ఉండవని స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో తన కార్యాలయం వద్ద మీడియాతో ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. 'విజన్ డాక్యుమెంట్ - 2047 అమలుపై నిరంతర పర్యవేక్షణ, సమీక్ష ఉంటుంది. ఆ లక్ష్యాలను సాధించేందుకు నెలవారీ, త్రైమాసిక ప్రణాళికలు రూపొందించుకుని వాటిని పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేస్తాం. 'విజన్' లక్ష్యసాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణకు కూడా కొత్త పంథా అమలు చేయబోతున్నాం.' అని తెలిపారు.


అదానీ వ్యవహారంపై..


ఈ సందర్భంగా అదానీ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందించారు. సెకితో సౌర విద్యుత్ ఒప్పందాల్లో మాజీ సీఎం జగన్‌కు అదానీ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చారంటూ అమెరికాలో కేసు నమోదవడం, ఈ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడనుండడంతో ఆ ఒప్పందాలను పునఃసమీక్షిస్తారా.? అని విలేకరులు ప్రశ్నించగా.. 'ఈ వ్యవహారంపై సమగ్ర సమాచారాన్ని తీసుకుంటున్నాం. కేసును రాష్ట్ర పరిధిలో విచారించేందుకు అవకాశం ఉందా అనే అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదించాల్సి ఉంది.' అని చెప్పారు.


ఇక ఒప్పందాల రద్దు అంశానికొస్తే.. పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోకుండా.. అటు ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా అన్ని కోణాల్లో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని సీఎం తెలిపారు. తాము ఊరికనే ఏదీ మాట్లాడలేమని.. అన్నీ పరిశీలించి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.


'మూడేళ్లలో అమరావతికి రూపు'


అటు, రాజధాని అమరావతికి మూడేళ్లలో ఓ రూపు తీసుకొస్తామని.. ఇందుకోసం రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'అమరావతి రాజధానిలో టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలిచాం. డిసెంబర్ 15 నుంచి పనులు ప్రారంభిస్తున్నాం. 6 నెలల్లో ఎమ్మెల్యే క్వార్టర్లు పూర్తి చేస్తాం. వారందరికీ ఇక్కడే క్వార్టర్లు ఇస్తున్నాం. అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. అన్ని నివాసాలు, కార్యాలయాలు, రహదారులు, ప్లాట్లు అభివృద్ధి చేసి మూడేళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకొస్తాం.' అని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు కోరగా.. పారదర్శకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు సమాధానమిచ్చారు. మరోవైపు, పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరులోగా పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని చెప్పారు. 'ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,157 కోట్లు ఇచ్చింది. మొత్తం రూ.55,549 కోట్లు అవుతుందని అంచనా. ఇప్పటికీ రూ.11,762 కోట్లు ఖర్చు చేశాం. డయాఫ్రం వాల్ 2026 మార్చి నాటికి పూర్తి చేస్తాం.' అని వివరించారు.


బోస్టన్ గ్రూప్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర - 2047


మరోవైపు, ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించే 'స్వర్ణాంధ్ర - 2047' బాధ్యతలను ప్రభుత్వం బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌నకు అప్పగించింది. విజన్ డాక్యుమెంట్ తర్వాత 12 నెలల పాటు కార్యక్రమ అమలుకు సంస్థ సహకారం అందిస్తుంది. దీని కోసం రూ.3.54 కోట్లు చెల్లించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శుక్రవారం పరిపాలన అనుమతులిచ్చారు.


Also Read: AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?