Somu Veerraju Amaravati :   ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ అధికారంలోకి రాగానే తొలి సంతకం దేనిపై చేస్తామో ప్రకటించేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్న వీర్రాజు మొదటి సంతకం రాజధాని కోసమే చేస్తానని చెబుతున్నారు. రూ. పది వేల కోట్లతో మూడంటే మూడు  ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఏపీ రాజధాని విషయంలో సోము వీర్రాజు మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారు. రాజధాని అమరావతినే అని చెబుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ రాజధాని కట్టలేకపోయిందని.. టీడీపీ రూ. ఏడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేసింది కానీ.. అమరావతిలో ఏం కట్టిందో తెలియడం లేదన్నారు. 


అమరావతికే బీజేపీ మద్దతు !


ఏపీ రాజధాని ( AP Capital ) విషయంలో భారతీయ జనతాపార్టీ విధానం అమరావతికే అనుకూలంగా ఉంది. అయితే కేంద్రంలో అధికారంలో .. చట్ట విరుద్ధంగా మూడు రాజధానులను ( Three Capitals )  ఏర్పాటు చేసే ప్రయత్నాలను జగన్ సర్కార్ చేస్తున్నా నిలువరించలేకపోయిందన్న విమర్శలు బీజేపీ ఎదుర్కొంది. అందుకే  బీజేపీ ఆశీస్సులతోనే జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారన్న అభిప్రాయం విపక్ష పార్టీల్లో ప్రజల్లో ఏర్పడింది. అయితే బీజేపీ కేంద్ర నేతలు మాత్రం రాజధాని ఏర్పాటు అనేది తమ చేతుల్లో లేదని.. రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని చెబుతూ వస్తున్నారు. తమ విధానం మాత్రం అమరావతే అంటున్నారు. 


వైఎస్ఆర్‌సీపీ కి అనుకూలంగా వ్యవహరించినట్లుగా విమర్శలు!


ప్రధానమంత్రి నరేంద్రమోడీ ( PM Modi ) శంకుస్థాపన చేసిన అమరావతి విషయంలో కేంద్రం పట్టించుకోడవం లేదని రాజకీయ పార్టీలు కూడా విమర్శించాయి. చివరికి  బీజేపీ తాము అమరావతికే మద్దతని ప్రకటించడమే కాదు అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పెడతారో లేదో తెలియదు కానీ సోము వీర్రాజు మాత్రం తమ పార్టీ ఉద్దేశాన్ని చురుకుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అమరావతిని నిర్మించి తీరుతామంటున్నారు.  


మూడేళ్లలో రాజధాని కట్టేస్తామంటున్న సోము వీర్రాజు


ఆత్మకూరు ఉపఎన్నికల్లో ఇతరపార్టీలు ఏవీ పోటీ చేయడం లేదు. టీడీపీ, జనసేన పోటీ చేయడం లేదు. తాము పోటీ చేస్తున్నామని.. తామే అసలైన ప్రతిపక్షమని సోము వీర్రాజు చెబుతున్నారు. అమరావతి అంశంతోనే ఆత్మకూరులో జోరుగా ప్రచారం చేస్తారేమో తెలియదు కానీ ఎన్నికల్లో మాత్రం గట్టిపోటీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.