BJP Vishnu Fire On Undavalli : రాష్ట్ర విభజన అక్రమం అంటూ సుప్రీంకోర్టులో కేసులు వేసి మరీ పోరాటం చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్‌తో కలిసి రాజకీయం చేస్తూండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను బీజేపీ వ్యతిరేకినని.. తనలాగే కేసీఆర్ ఆలోచిస్తున్నారని అందుకే ఆయనతో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించామని ఉండవల్లి చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మండి పడ్డారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెబుతూనే రాజకీయాల గురించి మాట్లాడతారు,నేతలను కలుస్తారు, ప్రశ్నిస్తే అబ్బెబ్బే అదేం లేదండి ఉత్తినే పిలిస్తే వెళ్ళానంటారని విమర్శించారు. ఊసరవెల్లి రాజకీయాలు మానేసి మీ దృష్టిని బీజేపీ మీద నుండి మీకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ ను పైకి లేపడం మీద పెట్టండని విష్ణువర్ధన్ రెడ్డి సలహా ఇచ్చారు.
పది రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించడంతో ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌లో లంచ్ భేటీ నిర్వహించానని ఉండవల్లి తెలిపారు. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నానన్నారు. ఆ భేటీ అయిపోయిన తర్వాత కేసీఆర్ జాతీయ స్థాయిలో పెట్టబోతున్న భారత రాష్ట్రీయ సమితికి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంచార్జ్‌గా ఉంటారన్న ప్రచారం జరిగింది. అయితే దీన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న వెంటనే ఉండవల్లి ఖండించారు. తాను రాజకీయాల నుంచి రిటైరయ్యానన్నారు.
అదే సమయంలో ఉండవల్లి మాటలు గందరగోళంగా ఉన్నాయి. మూడు గంటల పాటు చర్చించామన్నారు కానీ.. జాతీయ రాజకీయాలపై కాదంటారు . కేసీఆర్ జాతీయ పార్టీపై చర్చించలేదంటారు..మళ్లీ బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క కేసీఆర్‌కే ఉందంటారు. ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉందంటారు. మోడీ స్థాయిలో కమ్యూనికేటర్ అని కూడా కితాబులిచ్చారు. ఉండవల్లి ఇంత గందరగోళ ప్రకటనలు చేయడంతో రాజకీయవర్గాల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీని టార్గెట్ చేసి కేసీఆర్ చేస్తున్న రాజకీయంగా ఉండవల్లి భాగం కావడంతో ఆయనపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలను తప్పించుకోవడానికో.. స్పందించకుండా ఉండటానికో కానీ.. తాను రాజకీయాల నుంచి రిటైరైపోయానని ఉండవల్లి చెబుతున్నారు.