తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టేశారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి, ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. ఇప్పటికే మెజార్టీ అభ్యర్థులకు బీఫారాలను అందజేశారు. బీఫారాలు అందుకున్న నేతలు నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. ఇటు కేసీఆర్ ప్రతి రోజు 2, 3 నియోజకవర్గాలను తిరుగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తెలంగాణలో ప్రచారాన్ని మొదలు పెట్టేశారు. కేసీఆర్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు.
రాజకీయాల్లోకి ప్రభుత్వ ఉద్యోగులు
మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలువురు అధికారులు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా ఎన్నికల్లో పోటీ చేశారు. కొందరు రాజకీయాల్లోనూ సక్సెస్ అందుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ప్రజలకు మరింత సేవ చేయవచ్చని, వారి సమస్యలకు పరిష్కారానికి పాటు పడవచ్చని అంటున్నారు. గెజిటెడ్ అధికారుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ ల వరకూ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
మామిళ్ల రాజేందర్ ఉద్యోగానికి రాజీనామా
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయన వైద్య, ఆరోగ్య శాఖలో సూపరింటెండెంట్ గా పని చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తూ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. మామిళ్ల రాజేందర్ దరఖాస్తును పరిశీలించిన ఉన్నతాధికారులు, ఆయన వీఆర్ఎస్ దరఖాస్తుకు ఆమోదముద్ర వేశారు. త్వరలోనే ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి మాజీ ఆఫీసర్ల ఆసక్తి
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, ఐఆర్ఎస్ అధికారిగా పని చేసిన ఏపీ మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ టీఎన్జీవో అధ్యక్షులు స్వామిగౌడ్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఐఏఎస్ అధికారి రామాంజినేయులు ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంతా ఉంది. మొన్నటి వరకు ఏపీలో ఐఏఎస్ అధికారులుగా పని చేసిన విజయ్ కుమార్, కరికాళవళవన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. విజయ్ కుమార్, కరికాళవళవన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో కొందరు స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజానామా చేస్తే, మరికొందరు రిటైర్ మెంట్ అయ్యాక రాజకీయాల్లోకి ప్రవేశించారు.
కొందరు సక్సెస్
సీఐగా పని చేసిన గోరంట్ల మాధవ్ వైసీపీ తరఫున హిందూపురం ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీఎన్జీవో అధ్యక్షుడిగా పని చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా సక్సెస్ కాలేకపోయారు. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేస్తున్నారు.