Andhra New Districts :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ జిల్లాలను పునర్‌వ్యవస్థీకరించే ఆలోచన చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా చివరి స్థాయిలో ఉందని కూడా అనధికారికంగా సమాచారం లీక్ చేశారు. కానీ ఎవరూ మాట్లాడటం లేదు. కొంత సమాచారం లీక్ చేయడం ద్వారా ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన తాము అనుకున్నట్లుగా లేదని..  ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయని అంటున్నాయి. అందుకే ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 


కొత్త జిల్లాలకు ఇంకా పడని  రాష్ట్రపతి ఆమోద మద్ర


ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలకు కేంద్రం కోడ్‌లు ఇచ్చింది కానీ.. ఇప్పటి వరకూ రాష్ట్రపతి ఉత్తర్వులు పొందేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించలేదు. కొత్త జిల్లాల ప్రాతిపదికగా జోన్లను ఏర్పాటు చేస్తూ రష్ట్రపతి  ఉత్తర్వులు విడుదల చేయించుకుంటేనే గుర్తింపు ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఈ జోనల్ వ్యవస్థకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.  ప్రస్తుతం జోన్ -1 కింద ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉన్నాయి. జోన్ -2 లో ఉమ్మడి గోదావరి, క్రిష్ణా ఉండగా, జోన్ -3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉన్నాయి. అదే విధంగా జోన్ -4 కింద చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. తాజాగా రెండు జోన్లను అదనంగా పెంచటం వల్ల కొత్త జిల్లాలు జోనల్ వ్యవస్థలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక జోన్ కింద ఉమ్మడి ఆరు జిల్లాలు, మరో జోన్ కింద ఉమ్మడి ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో రెండు మల్టీ జోన్లు రానున్నాయి. దీని వలన ప్రాంతీయ కార్యాలయాలు అదనంగా వస్తాయి. స్థానిక, జోన్ల పెంపు పై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది.  జిల్లాలు ఏర్పాటు చేసి ఇంత కాలమైనా జోన్ల పై నిర్ణయం తీసుకోకపోవడం వెనుక జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ఆలోచనలు ఉన్నాయన్న  అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


కొత్త జిల్లాలపై ప్రజల్లో సంతృప్తి లేదా ? 


పార్లమెంట్ స్థానానికి ఓ జిల్లా చొప్పున ఇరవై ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ ఇరవై ఆరు ఏర్పాటు  చేశారు.  ప్రస్తుతమున్న 26 జిల్లాల సంఖ్యను పార్లమెంటు స్థానాలకు సమానంగా 25కు తగ్గించాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.  పనిలో పనిగా ఎన్నికల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.  అన్నమయ్య జిల్లా ఏర్పాటు వల్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న కడప జిల్లా చేజారిపోతుందన్న అభిప్రాయం అక్కడి నాయకుల్లో వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నమయ్య జిల్లా ఏర్పాటును రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్దరించాలని వారు కోరుతున్నారు. కడప జిల్లాను అలానే ఉంచి, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజక వర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇలాంటి ప్రతిపాదనేదీ లేదని.. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రంగా .. రాయచోటి ఉంటుందని ఆయన చెబుతున్నారు.  అనంతపురం జిల్లాను తిరిగి పూర్వస్థాయికి తీసుకురావాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సత్యసాయి జిల్లాను రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. పాలనపరంగా వీలుకాకపోవడంతో పాటు, విభజన తరువాత మారిన రాజకీయ పరిస్థితులు కూడా దీనికి కారణమని చెబుతున్నారు. 
  
పోలవరం జిల్లా ఏర్పాటు డిమాండ్ 


గిరిజన ప్రాంతాలతో ఏర్పాటైన పార్వతిపురం మన్యం జిల్లా ఏర్పాటు నుండి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గనుందని చెబుతున్నారు.  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేశారు.  చిన్న జిల్లా కావడం, పాలనాపరంగా అసౌకర్యంగా ఉండటం వంటి కారణాలతో పార్వతిపురం మన్యం జిల్లాను రద్దు చేసి..   పోలవరం కేంద్రంగా కొత్తగా మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ ప్రతిపాదనకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోంది.  


తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తాము అధికారంలోకి  వస్తే.. జిల్లాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరిస్తామని ప్రకటించింది. తామే  ఆ పని ముందు  చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.  నిజంగానే చేస్తారా  ఎన్నికలకు ముందు మళ్లీ రిస్క్ ఎందుకు అనుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.