TDP Seats In Ananthapuram: ఉమ్మడి అనంతపురం (Ananthapuram) జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మొండిపట్టు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కొందరికి టికెట్లు రాక మదన పడుతుంటే వీరు మాత్రం తమకు ఆ స్థానాలే కావాలంటూ పట్టుబడుతున్నారు. మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా అధ్యక్షుడు డీకే పార్థసారథి ఈసారి ఎంపీ స్థానాలకు పంపించే యోచనలో  ఉన్నట్లు టీడీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలని పంపించింది. ఇద్దరు నేతలు మాకు ఎంపీలు వద్దు ఎమ్మెల్యే టికెట్లే కావాలంటూ అధిష్టానం ముందు మొండిపట్టు పట్టుకున్నట్లు జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే కూర్చున్నారు. రాయలసీమ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ బీద రవిచంద్రకు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. అనంతపురం ఎంపీగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, హిందూపురం ఎంపీగా బీకే పార్థసారథి పేర్లను అధిష్టానం ప్రతిపాదనకు తీసుకువచ్చింది. ఈ ఇద్దరు నేతలు ఈసారి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఇదే తమకు చివరి అవకాశం అని అధిష్టానం ముందు అభ్యర్థించినట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.


గెలుపుపై ధీమా


వైసీపీ పాలనపై అలుపెరగని పోరాటం చేశానని నియోజకవర్గంలో బలమైన క్యాడర్ కూడా ఏర్పాటు చేసినట్లు కాల్వ శ్రీనివాసులు అధిష్టానానికి తెలిపారు. ఈసారి తనకు కచ్చితంగా రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాల్సిందేనని ఆయన పేర్కొనట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాల కారణంగా ఓట్లు చీలి తన గెలుపు సునాయాసం అవుతుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాయదుర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తప్పించి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు.. గ్రూపు రాజకీయాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే కచ్చితంగా రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తానని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు కాల్వ శ్రీనివాసులు విన్నవించుకున్నారు. మరోవైపు, తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన స్పష్టం చేయడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అటు, అనంతపురం మాజీ జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి రాయదుర్గం టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నారు. అధినేత చంద్రబాబును ఇద్దరు నేతలు ఇప్పటికే పలుమార్లు సంప్రదించారు. 


అటు, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే డీకే పార్థసారథి పేరును తెరమీదకు తీసుకువచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఎంపీ, ఎమ్మెల్యేగా పలుమార్లు అవకాశాలు అంది పుచ్చుకున్నారు. ఈసారి పెనుగొండ నియోజకవర్గంలో భారీగా ఆశావాహులు పెరగటం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్థసారధిని ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను పార్లమెంటు సమన్వయకర్తగా నియమించారు. హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా బోయ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ మాజీ ఎంపీ శాంతమ్మ అవకాశం కల్పించారు. ఇలా సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే చంద్రబాబు పార్టీలో సీనియర్లుగా ఉన్న కాల్వ శ్రీనివాసులను, బీకే పార్థసారదులను ఎంపీలుగా పోటీ చేయించాలని చూస్తున్నారు. పార్థసారథి సైతం తనకు ఇవే చివరి ఎన్నికలని ఈ ఒక్కసారి పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేయించాలని చంద్రబాబు ముందు తన గళాన్ని వినిపించారు. ఈసారి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే టికెట్ పొందుతే బీసీ కోటా కింద మంత్రి పదవులు కూడా పొందడానికి అవకాశం ఉంటుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.


పదవిపై ఆశలు


2014 ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ గా తర్వాత మంత్రివర్గ విస్తరణలో గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రిగా సేవలందించారు. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి 2019లో ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా బీసీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందంటూ ఆశగా ఉన్నారు. ఇలా ఎవరికి వారు వారి అంచనాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉండటం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. వీరిద్దరూ అనుకున్నట్లు ఎమ్మెల్యే టికెట్లు సాధిస్తారా లేక అధిష్టానం సూచన మేరకు ఎంపీలుగా బరిలో ఉంటారా అన్నది మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.