Anantapur News: అనంతపురం జిల్లాలో ఎన్నికల బరిలో దిగాలని భావించిన ఇద్దరు పోలీస్ అధికారుల ఆశలు నిరాశలయ్యాయి.ఓ అధికారి పేరైతే అధికార పార్టీ విడుదల చేసిన మూడో జాబితాలో వచ్చింది. అయినప్పటికీ  నాలుగో జాబితాలో పేరు మాయమైపోయింది. మరో అధికారికి ముగ్గురు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసిన అధిష్ఠానం మాత్రం మెండిచేయి చూపించింది. అసలు ఏం జరిగింది. ఈ అధికారుల పేర్లు ఎవరు ప్రతిపాదించారు. ఎందుకు తిరస్కరించారు. 


అనంతపురం జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుకు అధికార పార్టీ వైసీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ముగ్గురు పోలీస్ అధికారులు ఆ రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పోటికి సిద్ధపడ్డారు. ముఖ్యంగా మడకశిర నియోజకవర్గానికి సంబంధించి మడకశిర సీఐగా పనిచేసిన శుభకుమార్ ప్రస్తుతం సిఐడిలో పనిచేస్తున్నారు. ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నించారు. ముఖ్యంగా చంద్రబాబునాయుడుకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ అధికారి కూడా పని చేశారు. 


ఒక పోలీసు ఉన్నతాధికారి సాయంతో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి... వచ్చే ఎన్నికల్లో మడకశిర నుంచి తనకు అవకాశం కల్పించాలని దానికి తగ్గ ఆర్థిక వనరులు ఉన్నాయని ప్రపోజల్ పెట్టారంట. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఓకే అంటూ ఆయన పేరును మూడో జాబితాలో అవకాశం ఇచ్చారు. అయితే ఆ తర్వాత అసలు కథ మొదలైంది.


ఏకంగా ఆర్థిక వనరుల విషయంలో సిఐ సిద్ధంగా ఉన్నారా ఆయన స్థాయి ఏమిటి.. అని పార్టీ వర్గాలు పూర్తిస్థాయిలో విచారణ మొదలు పెట్టారంట. దీనికి తోడు మడకశిరలోని స్థానిక వైసీపీ నాయకత్వం కూడా గతంలో ఆ వ్యక్తి తమను ఇబ్బందులు పెట్టారంటూ ఫిర్యాదు చేశారట. మొత్తం మీద ఆర్థిక వనరులు విషయంలో సీఐ పూర్తిస్థాయిలో అధిష్టానాన్ని సంతృప్తి పరచలేక పోయారని టాక్. అందుకే ఆయన స్థానంలో మరో వ్యక్తి స్థానికుడు వీర లక్కప్పకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. మొత్తంమీద ఆ విధంగా సిఐ ఆశలు అడియాసలు అయ్యాయి.


సింగనమల నియోజకవర్గం సంబంధించిన మరో పోలీస్ అధికారి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నారు. ఆయన తన స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి యువగళం  పాదయాత్రలో నారా లోకేష్‌ను బాగా ఇబ్బంది పెట్టారట. మైక్ లాక్కోవడం క్యాడర్‌ను దూరంగా తరమడం, ఓ నియోజకవర్గంలో అయితే పూర్తిస్థాయిలో యువగళానికి  కార్యకర్తలు రాకుండా నిర్బంధించారట. ఇవన్నీ చేసి వైసీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారట. 


ఇదే సమయంలో సింగనమల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి టికెట్ ఇచ్చే విషయంలో చర్చలు మొదలయ్యాయి.  ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఓ బలమైన సామాజికవర్గం నేతలు అధిష్టానానికి సీరియస్‌గా చెప్పారట. ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి కుటుంబం వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. 


దీంతో నియోజవర్గంపై పట్టు కోల్పోకుండా వీరాంజనేయులను తెరమీదకి తీసుకొచ్చారు ఆలూరు సాంబశివారెడ్డి. ఆయనకు టికెట్ ఇప్పించారు. ఇక్కడ  పెద్దారెడ్డితోపాటు చాలా మంది పోలీస్ అధికారికి సపోర్ట్ చేసినప్పటికీ సీఎంఓలోని సీనియర్ అధికారులు మాత్రం ఆలూరు సాంబశివారెడ్డి సూచించిన అభ్యర్థి వైపే మొగ్గుచూపారట. 


రాయలసీమ వ్యాప్తంగా ఈ పోలీస్ అధికారుల టికెట్లు అంశం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకరి పేరు అయితే జాబితాలో వచ్చి తిరిగి మిస్ అవ్వడం మరొకరి పేరు అధిష్టానం వద్ద పూర్తిస్థాయిలో చర్చకు రావడం.. ఆ తర్వాత ఆగిపోవటం జరిగిపోయింది. తిరస్కరణ కూడా అయిపోయింది. పోలీసు అధికారులు ఖాకీని వదిలి ఖద్దరు వేయలనుకొన్నా కొన్ని పరిణామాలతో ఖాకీకే పరిమితం కావాల్సి వచ్చింది.