Amaravati Lands :  అమరావతి రాజధాని అంశం ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. గత  ప్రభుత్వం హైదరాబాద్ లాగా అబివృద్ది చేసి .. మరో మెట్రో సిటీని సిద్ధం చేసుకుంటామని కలలు కన్నది. కానీ మారిన ప్రభుత్వం  మాత్రం అసలు ఆ గ్రాఫిక్స్ ఎలా సాధ్యమని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇప్పుడు రైతులు ఇచ్చిన భూముల్ని పేదలకు పంచేందుకు సిద్ధమయింది. నిజానికి ఆ భూముల్ని రైతులు పూర్తిగా ప్రభుత్వానికి పరిహారం తీసుకుని ఇవ్వలేదు. డెలవప్‌మెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చారు. అక్కడే అసలు సమస్య వచ్చింది. రైతులకు చట్టం ప్రకారం కల్పించాల్సిన ప్రయోజనాలు కల్పించకుండానే హామీ ఇచ్చినట్లుగా అభివృద్ధి చేయకుండానే వారి భూముల్ని సెంటు స్థలాలకు ఇస్తున్నారు. ఇప్పుడు విషయం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ పట్టాలు పంచడానికి రెడీ అయ్యారు. దీంతో వివాదం ప్రారంభయింది. 


సెంటు స్థలాలుగా పంపిణీ చేసినా అవి కోర్టులో ఉన్న  భూములే !


యాబై వేల కుటుంబాలకు అమరావతిలో రైతులు ఇచ్చిన పొలాల్లో సెంటు స్థలాలను కేటాయించడం అంటే చిన్న విషయం కాదు. అయితే ఇలా ఇస్తున్న పట్టాలపై ఒక్క పేద కుటుంబానికి కూడా హక్కు రాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది..  భూయాజమాన్య హక్కులు కోర్టు తీర్పు తర్వాతనే తేలుతాయని . ప్రస్తుతం రాజధాని అంశంపై పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ మరీ ఆర్ 5 జోన్ లో ఇళ్ల స్థలాలను ఏపీ ప్రభుత్వం ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రేపు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తే..  ఈ ఇళ్ల స్థలాలు ఇప్పుడు పంపిణీ చేసినా పేదలకు హక్కులు లేకుండా పోతాయి.  దాని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. 


సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోమని మాత్రమే చెప్పింది.. ఇవ్వమనలేదు !


సుప్రీంకోర్టు అమరావతిలో సెంటు ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చని చెప్పిందంటూ ప్రచారం జరుగుతోంది కానీ..అటు హైకోర్టు కానీ..ఇటు సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వం పంపిణీ చేయాలనుకున్న పట్టాల విషయంలో జోక్యం చేసుకోబోమని మాత్రమే చెప్పింది. ప్రభుత్వానికి ఉన్న అధికారాల ప్రకారం ప్రభుత్వం చేస్తోంది. కానీ అది లీగలా..ఇల్లీగలా అనేది అమరావతిపై పిటిషన్లపై విచారణలోనే తేలనుంది. అందుకే జోక్యంచేసుకోబోమని చెప్పింది. ఒక వేళ అలా పంపిణీ చేయడం ఇల్లీగల్ అని..సీఆర్డీఏ చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని తీర్పు వస్తే అది ప్రభుత్వానికీ చెంపపెట్టు అవుతుంది. 


పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు !


సీఎం జగన్ పేదలకు సెంటు స్థలాలుఇవ్వాలనుకుంటే..  అనేక చోట్ల ఇతర స్థలాలు ఉన్నాయి. వివాదాస్పద భూముల్నే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పేదల పేరుతో అమరావతిపై కుట్ర చేయడానికే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అమరావతిని నిర్వీర్యం చేయడానికి పేదలను అడ్డం పెట్టుకుంటున్నారని విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నాయి. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ధర్డ్ పార్టీకి హక్కులు కల్పించడం సాధ్యమయ్యే విషయం కాదని చెప్పడానికి నిపుణులు అవసరం లేదని చెబుతున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే రైతులకు పూర్తి స్థాయిలో.. నష్టపరిహారాన్ని దాదాపుగా 70 వేల కోట్ల వరకూ చెల్లిస్తే ఆ భూముల్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రభుత్వం వద్ద అంత వెసులుబాటు లేదు. అందుకే పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 


కోర్టు కేసులు క్లియర్ అయిన తర్వతా ఇస్తే విమర్శలకు చెక్ 


ఇప్పుడు యాజమాన్య హక్కులు లేని పట్టాలను ఇవ్వడం వల్ల పేదలకు కూడా పెద్దగా మేలు జరగదు.  అక్కడ వారు ఇళ్లు కట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఇళ్లు కట్టుకున్న తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే వారి సొమ్ము మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఇల్లు కట్టుకోండి అని చెబితే ప్రజలు నమ్మరు. అందుకే కోర్టు తీర్పులు క్లియర్ అయిన తర్వాతే అమరావతి భూములు పంపిణీ చేస్తే ప్రభుత్వం నిజాయితీగా ఉందని ప్రజలు నమ్ముతారన్న అభిప్రాయం వినిపస్తోంది. లేకపోతే పేదలు కూడా తమను రాజకీయ కుట్రలకు వాడుకుంటున్నారన్న అభిప్రాయానికి వస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.