Amadalavalasa MLA Ravikumar is unhappy : మంత్రి పదవి దక్కలేదని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పై గెలిచిన కూన రవికుమార్ అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది.   జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కూన రవికుమార్ అనేక వేధింపులను ఎదుర్కొన్నారు.     వైసీపీ బెదిరిపులకు, పోలీసుల అత్యుత్సాహానికి,  అరెస్ట్లకు ఎదురొడ్డి టీడీపీ జెండానే ధైరంగా పట్టుకుని ముందుకు నడిచిన రవికుమార్ టీడీపీలో ఒక అంబాసిడర్గా నిలిచారని చెప్పక తప్పదు. రాజకీయ పోరాట రణంలో గెలిచి జనంలో నిలిచిన సిక్కోలు పోరాట యోధుడిగా తెలుగు తమ్ముళ్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. 


ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనుకున్న రవికుమార్ 


టీడీపీ గెలవడంతో మంత్రివర్గంలో తప్పనిసరిగా చోటు దక్కుతుందని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, భువనేశ్వరి ఆశీస్సులు, లోకేష్ అండదండలున్నాయని ఆమదాలవలస నియోజకవర్గం నుంచే కాకుండా జిల్లాలో రాజకీయ విశ్లేషకుల సైతం మంత్రిగానే వస్తారని ఆశించారు. అయితే  తన నియోజకవర్గానికి ఆదివారం ఎమ్మెల్యేగానే వస్తున్నారు. వాస్తవంగా ఆ సామాజిక వర్గం నుంచే కాకుండా జిల్లాలో మిగిలిన రాజకీయ వర్గాల్లో రవి మంత్రి పదవి దక్కకపోవడంపై చర్చించుకుంటున్నారు. అందుకు ప్రధానంగా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం టీడీపీలో దూకుడు పెంచిన నేతలకు ఎలా టార్గెట్ చేసిందనేది వేరేగా చెప్పనక్కర్లేదు. కేవలం రవికుమార్ కాకుండా కుటుంబం మొత్తం అవమానాలు, ఒత్తిళ్లు భరించారు. ఏకంగా 19 కేసుల్లో నిందితుడిగానే ఉన్నారు. జైళ్లుకు కూడా వెళ్లివచ్చారు. ఇవన్నీ ఎన్నికల ముందు కూడా ఎవరూ చర్చించలేదు. ఈ సారి ఎన్నికల్లో రవికుమార్‌కు అండగా నిలిచి గెలిపిద్దామన్న ధీమాతోనే అందరు మద్దతిచ్చారు. 


సామాజిక సమీకరణాలతో దక్కని మంత్రి పదవి     


ప్రభుత్వం ఏర్పడితే రెండో మంత్రిగా కూన రవికుమారే ఉంటారని, అధికార, ప్రతిపక్ష, బీజేపీ, జనసేన వామపక్ష నేతల సైతం భావించారు. అందుచేతనే మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కకపోవడం సంచలనాత్మకంగా మారింది. జిల్లాలో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన రవికుమార్‌కు అటు చట్టాలపై అవగాహన ఉంది. పార్టీ శ్రేణులకు అండగా నిలవడంలో మార్కు ఉంది. అటు నారా కుటుంబంలో నాలుకగా రవి నిలిచారు. ఎన్నికల సమయంలో పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు సీటు దక్కక పోవడంతో టీడీపీలో ఏర్పడిన ముసలం అంతాఇంతా కాదు. అయినా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కూన రవికుమార్ ఒక మెట్టు కిందకు దిగారు. కలమట వెంకటరమణ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని కారాలు, మిరియాలు నూరిన సందర్భంలో ఆయనను శాంత పర్చడం పార్టీకి ఆ నియోజక వర్గంలో నష్టంలేకుండా ఉండేం దుకు ఎన్నికల సమయంలోనే పార్టీ అధ్యక్షుడి పదవిని త్యాగం చేసిన ఘనత రవికుమార్‌కు దక్కింది. అప్పట్లోనే చంద్రబాబు నాయుడు వద్ద మెప్పు పొందారని తెలుగు తమ్ముళ్లు ఎంతో సంబరపడ్డారు. ఈ తరుణంలో రవికి మంత్రి పదవి దక్కక పోవడం ఆయనను అభిమానించే పార్టీ శ్రేణులకు కొంత అసహనం, అసంతృప్తి పార్టీ పెద్దలపై కలగక మానదు. అయినా రవికుమార్ ఎక్కడా కూడా నోరు జారకుండా వారిని సముదాయించి కేడర్లో మళ్లీ జోష్ నింపేందుకు కృషి చేశారని చెప్పక తప్పదు. 


కాళింగ వర్గానికి ప్రాధన్యత దక్కలేదన్నబావన


కాళింగ సామా జిక వర్గానికి చెందిన రవికుమార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని, ఆయనకు అండగా నిలవాలంటూ చంద్రబాబును కొందరు సమావేశాల్లో డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో హల్చల్ చేయడం పట్ల ఆయన కొందరిపై చిరాకు పడినట్టు సమాచారం. తదుపరి సామాజిక వర్గం కాస్త చల్లబడ్డారని చెప్పొచ్చు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహించడం, జెండా మోసిన కార్యకర్తగానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం కూన రవికుమార్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పెద్దఎత్తున కేడర్ స్వాగతం పలికేందుకు సమాయత్తమతున్నారు. విశాఖ ఎయిర్పోర్టు నుంచి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించిన ఆమదాలవలస వరకు అడుగడుగునా స్వాగత ఏర్పాట్లకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆమదాలవలస నియోజక వర్గంలోనే కాకుండా శ్రీకాకుళం, విశాఖకు వెళ్లే వరకు ఎక్కడికక్కడ ఫెక్సీలు ఏర్పాటుచేశారు. అభిమాన నేతకు అభినందన ర్యాలీ అంటూ కూటమి శ్రేణులు సన్నద్ధమౌతున్నారు.