Alla Ramakrishna Reddy resign : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి ( Alla Resign ) రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనమా చేసినా చేయకపోయినా అసలు విషయమే కాదు. ఎందుకంటే మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ( Assembly Elections ) ఉన్నాయి. కానీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడమే ఇక్కడ విశేషం. పార్టీకి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమిటన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ అయింది.
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఆళ్ల కుటుంబం
ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగరి ( Mangalagiri ) నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండో సారి ఆయన లోకేష్‌పై గెలిచారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. కోస్తా జిల్లాల బాధ్యతలన్నీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డినే చూసుకుంటారు. ఆయన రాజ్యసభ ఎంపీ కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు రాంకీ సంస్థ యజమానులు.
వైఎస్ఆర్‌సీపీ తరపున కోర్టుల్లో పిటిషన్లు వేసిన ఆళ్ల
ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి టీడీపీపై పోరాటం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా పలు రకాల పిటిషన్లు కోర్టుల్లో వేశారు. అమరావతిపై ఎన్జీటీలో పిటిషన్లు వేసిన వారికి సాయం అందించారు. టీడీపీ హయాంలో ఓ అధికారి ఏసీబీకి పట్టుబడిన సమయంలో .. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఊార్య పేరు వెలుగులోకి వచ్చింది.ఆ అధికారి ఆస్తులకు ఆమె బినామీగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఆ కేసు విషయంలోనూ వివాదమయింది. అప్పటి డీజీపీపై ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. అలాగే.. ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని అసైన్డ్ భూమలుు, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాలు అంటూ ఫిర్యాదులు చేశారు. వాటిపై కేసులు కూడా నమోదయ్యాయి. వైసీపీ హైకమాండ్ కు ఇంత సన్నిహితుడు అయిన ఆళ్ల ఇప్పుడు పార్టీకి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో ఎక్కడా టిక్కెట్ ఇచ్చేది లేదని చెప్పారా ?
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నఆళ్లకు ఈ సారి టిక్కెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతగా ఉన్న గంజి చిరంజీవిని ఇటీవల వైసీపీలో చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలో తనకు మంగళగిరిలో కాకపోతే మరో చోట సీటు కేటాయిస్తారని అనుకున్నారు. కానీ ఈ సారి సీటు ఇచ్చేది లేదని స్పష్టత ఇవ్వడంతో అసంతృప్తితోనే రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు.
లోకేష్ పై గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానన్న జగన్ - ఇప్పుడు సీటుకే ఎసరు
నిజానికి 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో లోకేష్ పై ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే.. మంత్రిని చేస్తానని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మంత్రి పదవి ఇస్తారేమోనని ఆళ్ల ఆశపడ్డారు.కానీ పదవి లేకపోగా అసలు టిక్కెట్ లేదని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు.