Yuvagalam Padayatra Has Reached 3000KMs Milestone : యువగళం పేరుతో లోకేష్ చేస్తున్న పాదయాత్ర మరో మైలురాయి చేరుకుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది. తేటగుంట వద్దకు వచ్చేసరికి 3000 కిలోమీటర్ల రికార్డును సొంతం చేసుకుంది పాదయాత్ర. 219వ రోజు 16.3 కిలోమీటర్లు నడిచిన లోకేష్‌ రాజులకొత్తూరులో 3000 కిలోమీటర్ల పాదాయ్తరకు గుర్తుగా పైలాన్ ఆవిష్కరించనున్నారు.

ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ ఇప్పటి వరకు పది జిల్లాలను కవర్ చేశారు. 92 నియోజకవర్గాల్లో సాగింది యాత్ర. చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిన టైంలో 80 రోజుల వరకు ఆగిపోయింది పాదయాత్ర. మళ్లీ నవంబర్‌ 26 నుంచి పునః ప్రారంభమైంది.


పాదయాత్రలో భాగంగా లోకేష్ ఆదివారంలో వరద బాధితులను పరామర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని వరద బాధితులను ఆదుకుంటామన్నారు. లోకేష్‌ మూడు నెలలు ఓపిక పట్టాలని సూచించారు. కాకినాడ సెజ్ బాధిత రైతులతో కూడా మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు మందగించిందని దాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఉన్న పరిశ్రమలను కూడా జగన్ ప్రభుత్వం వెనక్కి పంపేసిందని ధ్వజమెత్తారు. స్థానికులకు ఉద్యోగాలు అన్న జగన్... పరిశ్రమల ఏర్పాటునే పట్టించుకోవడం లేదని విమర్శించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమ తీసుకొచ్చానని, అందులో 6 వేల మంది పని చేసేవారని గుర్తు చేశారు. 



అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి, ఉద్యోగ పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు లోకేష్‌. అలాంటివి చేయాల్సిన ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. పెరుమాళ్లపురంలో మత్స్యకారులతో కూడా లోకేశ్ మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.



సీఎం జగన్‌కు వ్యవసాయంపై అవగాహన లేదని, అలాంటి వ్యక్తికి కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. బటన్లు నొక్కుతూ పాలన గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రజాధనంపై దోచుకునే పనిలో బిజీగా ఉన్నారని, సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కనీసం ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులివ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు విరిగి నీరు వృథాగా పోతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.



లోకేష్ పాదయాత్ర 20న భోగాపురం మండలం పోలిపల్లిలో ముగియనుంది. అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటుకు టీడీపీ కసరత్తు చేస్తోంది. అక్కడ సభా ఏర్పాట్ల కోసం అచ్చెన్నాయుడు భూమి పూజ చేయనున్నారు. దీనికి ఉత్తారంధ్రతోపాటు టీడీపీ కీలక నేతలంతా హాజరుకానున్నారు.