Kavtha National Politics : తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో ఢిల్లీ రాజకీయాల్లో యాక్టివ్ కానున్నట్లుగా తెలుస్తోంది.  కేటీఆర్ తెలంగాణ రాజకీయాలను.. కవిత ఢిల్లీ రాజకీయాల్లో  బీఆర్ఎస్ తరపున వ్యవహారాలు చక్కబెట్టే  బాధ్యతలను కేసీఆర్ అప్పగించాలని నిర్ణయించుకున్నట్లుగా కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ కన్వీనర్ గా కవితకు కేసీఆర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దానికి తగ్గట్లుగానే పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. 


కనిమొళి తరహాలోనే కవితకు ఢిల్లీ రాజకీయాలు అప్పగింత !


డీఎంకేలో కరుణానిధి ఉన్నప్పుడు వారసత్వం గురించి చర్చ  జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ ఉండాలని.. ఢిల్లీ రాజకీయాల్లో కనిమొళి ఉండాలని కరుణానిధి డిసైడ్ చేసి.. ఆ మేరకు కనిమొళిని ఎంపీగా పంపించారు. అప్పట్నుంచి డీఎంకే ఎలాంటి సమస్యా లేదు. ఎవరు పరిధిలో వారు డీఎంకే కోసం రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను కేసీఆర్ అమలు చేయాలని అనుకుంటున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్... బీఆర్ఎస్‌గా పేరు మారిన తర్వాత..తెలంగాణ శాఖకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల సమన్వయకర్తగా కవితను నియమిస్తారు. దీంతో తెలంగాణ వరకూ కేటీఆర్.. ఆపైన కవిత బీఆర్ఎస్ వ్యవహారాలు చూసుకుంటారు. 


కొన్నాళ్లుగా కేసీఆర్ వెంట ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్న కవిత !
 
 కవిత ఇప్పటికే పార్లమెంట్ సభ్యురాలుగా చేసిన అనుభవం ఉంది. జాతీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి.  వివిధ రాష్ట్రాలు, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌తోపాటు వెళ్తున్న కవిత గతంలో ఎంపీగా చేసిన అనుభవంతో జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌ ముంబై, ఢిల్లీ, జార్ఖండ్‌ పర్యటనల్లోనూ కవిత సీఎం వెంటే ఉన్నారు. మరోవైపు కేసీఆర్‌తోపాటు వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కవిత తన బృందంతో కలిసి జాతీయస్థాయి మీడియా సంస్థల అధినేతలు, ఎడిటర్లతో వరుస భేటీలు జరుపుతున్నారు.  సీనియర్‌ జర్నలిస్టు సంజయ్‌ కుమార్‌ ఝాను రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్రంగా పనిచేసేలా ప్రజాసంబంధాల అధికారిగా నియమించడం వెనుక  కవిత క్రియాశీలంగా వ్యవహరించారు.  


జాతీయ రాజకీయాల వ్యూహంలో కవితదే కీ రోల్ !


జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దూకుడు పెంచిన నేపథ్యంలో కవితను వెంట తీసుకెళ్తున్నారు. అక్కడి రాజకీయ పరిస్థితులతో పాటు ఆయా రాష్ట్రాల పరిస్థితులను తెలుసుకుంటూనే భవిష్యత్ లో చేపట్టబోయే కార్యాచరణకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. అందులో కవిత కీరోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీ కంటే లోక్ సభనే బాగుందని కవిత వెల్లడించిన అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. ఇప్పడు పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ నిర్వహించిన భేటీలో కవిత కూడా పాల్గొంటుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ విషయంలో ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు కూడా కవిత ద్వారానే సాగుతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచే మళ్లీ పోటీ ! 


వచ్చే ఎన్నికల్లో సైతం కవిత తిరిగి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో తిరిగి కవిత ఎంపీగా పోటీ చేయాలని పార్టీ నేతలు సైతం కవితకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి నిజామాబాద్ జిల్లా నుంచి కవిత ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని  టీఆర్ఎస్ వర్గాలు నమ్ముతున్నాయి.  


మొత్తంగా ఢిల్లీలో డీఎంకే తరపున కనిమొళి నిర్వహిస్తున్న బాధ్యతలు... బీఆర్ఎస్ తరపున కవితకు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.