Komatireddy Vs Shabbir :  తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత పార్టీ నేత షబ్బీర్ అలీపై తీవ్రమైన ఆరోపణలతో హైకమాండ్‌కు లేఖ రాశారు.  చీటింగ్ సహా పలు ఇతర కేసుల్లో షబ్బీర్ అలీకి ప్రత్యక్షంగా ప్రమేయం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన లేఖలో తెలిపారు. ఈ లేఖను సోనియాగాంధీకి పంపినట్లుగా మీడయాకు సమాచారం ిచ్చారు. ఆయనపై ఉన్న కేసుల  కారణంగా షబ్బీర్ అలీ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అదే జరిగితే పార్టీ పరువు పోతుందని చెప్పారు. షబ్బీర్ ను ఇంకా పార్టీలోనే కొనసాగిస్తే ఆయన వల్ల పార్టీకి నష్టం జరగవచ్చని కూడా కోమటిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.షబ్బీర్ అలీని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన ప్రియాంకా గాంధీని కోరారు.


రేవంత్ వర్గంగా గుర్తింపు పొందిన షబ్బీర్ అలీ 


హఠాత్తుగా షబ్బీర్ అలీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురి పెట్టడం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశమవుతోంది. నిజానికి షబ్బీర్ అలీ ఇటీవలి కాలంలో వివాదాస్పదం కాలేదు. ఆయనపై కేసులు సంచలనం కాలేదు. ఆయనను అరెస్ట్ చేస్తారన్న సమాచారం కోమటిరెడ్డి  వెంకటరెడ్డికి ఎలా తెలిసిందో కానీ.. ఆయన అరెస్ట్ అయితే పార్టీ పరువు పోతుంది కాబట్టి ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ముందుగానే కోరడం ఏమిటనేది పార్టీ నేతలకు అంతుబట్టడం లేదు. అయితే కొంత కాలంగా షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడి నియామకానికి పార్టీ హైకమాండ్ నిర్వహించిన అభిప్రాయసేకరణలో షబ్బీర్ అలీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడారు. 


గతంలో కోమటిరెడ్డికి పీసీసీ వద్దని హైకమాండ్‌కు చెప్పిన షబ్బీర్ 


కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు  రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంత మంది కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేశారు. వారిలో షబ్బీర్ అలీ కూడా ఉన్నారు. తన సోదరుడికి పీసీసీ ఇవ్వొద్దని హైకమాండ్‌కు షబ్బీర్ అలీ చెప్పారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇటీవలి కాలంలో షబ్బీర్ అలీ..  రేవంత్ తరపున యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. రేవంత్‌కు పీసీసీ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కోమటిరెడ్డి సోదరులు ఇప్పుడు పార్టీలో అంత యాక్టివ్‌గా లేరు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిపోగా.. వెంకటరెడ్డి అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటూ తనకు పదవి రాకుండా అడ్డు పడిన వారిపై ఫిర్యాదులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


సొంత పార్టీ నేతలను కోమిటిరెడ్డి టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి ?


కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నిక గురించి అందరూ సీరియస్‌గా బరిలోకి దిగితే.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకుటూ.. ప్రజల్లో చులకన అవుతున్నారన్న అభిప్రాయం వినపిస్తోంది.  పలువురు నేతల మధ్య వర్గ పోరాటం ఇప్పుడు మరో రేంజ్‌కు  చేరుతోంది. రేవంత్ మద్దతుదారులను వెంకటరెడ్డి టార్గెట్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తూండటంతో కొత్త వివాదాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.