అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో చాలా ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. పార్టీ మారి తప్పు చేశానంటూ ఓ మండలస్థాయి నాయకుడు ఓ మాజీ మంత్రి కాళ్లు పట్టుకొని వేడుకోవడం అక్కడి నేతలందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 


ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని మాజీ మంత్రి పరిటాల సునీత మరూరు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ మండలస్థాయి నేత చేసిన పనికి ఓ మాజీ మంత్రి పరిటాల సునీత ఆశ్చర్యపోయారు. ఆమెతోపాటు అక్కడి వారంతా ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారు.


ముచ్చుమర్రి రామాంజనేయులు అనే వ్యక్తి హఠాత్తుగా వచ్చి సునీత కాళ్ల పై పడ్డారు. ఏం జరిగిందో చెప్పకుండానే ఆమెను చూసిన వెంటనే కాళ్లపై పడి బోరున విలపించారు. ఏం జరుగుతుందో తెలియక కాసేపు ఆమె ఆమెతో వచ్చిన వారంతా గందరగోళంలో పడ్డారు. చివరకు రామాంజనేయుల సన్నిహితులు అసలు విషయం చెప్పారు.  


ఎప్పటి నుంచో తెలుగు దేశం పార్టీ నాయకుడిగా ఉండే రామాంజనేయులు... 2019 ఎన్నికలకు ముందు పార్టీ మారారు. సైకిల్‌ దిగి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇదే విషయంపై ఆయన తన పశ్చాతాపాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరి తప్పు చేశానంటూ బోరుమన్నారు. మాజీ మంత్రి సునీత కాళ్లపై పడి క్షమించాలని వేడుకున్నారు. 


ముందు కంగారుపడినా... అసలు విషయం తెలుసుకున్న సునీత... కాళ్లపై పడిన రామాంజనేయులను లేపి ఆప్యాయంగా పలకరించారు. జరిగిందేదో జరిగిందంటూ.. ఈ పార్టీలో ఎప్పటికీ మీ లాంటి వాళ్లకు చోటు ఉంటుందని తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. 


ఇక నుంచి పార్టీ కోసం నిర్విరామంగా శ్రమిస్తానని రామాంజినేయులు చెప్పారు. అనంతరం గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గతంలో పసుపు కుంకుమ, చంద్రన్న కానుక, పింఛన్లు అన్నీ పార్టీలకతీతంగా ఇచ్చేవారమని.. అయితే ఇప్పుడు పార్టీలు చూసి పథకాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది పింఛన్లు తొలగించినట్టు వాపోతున్నారని.. ప్రభుత్వం ఇలానే పింఛన్లు తొలగిస్తూ పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.



రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ మూడున్నరేళ్లలో అభివృద్ధి కనిపించదని.. కేవలం దౌర్జన్యాలు, సెటిల్మెంట్లే కనిపించయాని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మరూరు గ్రామంలో స్థానిక నాయకులతో కలసి ఆమె ఇంటింటికీ వెళ్లారు. ప్రతి ఇంట్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. ప్రధానంగా నిరుద్యోగ సమస్యలు, మహిళలు పడుతున్న ఇబ్బందులు, రైతులు పడుతున్న కష్టాలు ఇలా అన్ని వర్గాల వారి కష్టాలు తెలుసుకున్నారు. 


మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి తాము జాకీ పరిశ్రమ తీసుకొస్తే.. ఎన్నికల్లో ఖర్చు చేశామంటూ ఆ కంపెనీ ప్రతినిధులను 15కోట్లు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాము దీనిపై విమర్శిస్తే.. ఎమ్మెల్యే సోదరుడు అసభ్య పదజాలంతో చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబాన్ని, పత్రికాధిపతుల్ని దూషించారన్నారు. పైగా టీడీపీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. జాకీ పరిశ్రమ వచ్చి ఉంటే.. నియోజకవర్గంలో 6వేల మంది మహిళలకు ఉపాధి దొరికి ఉండేదన్నారు. కేవలం ఇదొక్కటే కాకుండా ఏ గ్రామంలో చూసిన ఎమ్మెల్యే సోదరుల అక్రమాలు, దౌర్జన్యాలే కనిపిస్తున్నాయన్నారు. చివరకు రైతుల భూములను లాక్కునేందుకు కూడా వెనుకాడటం లేదన్నారు. ఎన్నికలకు ఇక ఎంతో దూరం లేదని ప్రతి ఒక్కరూ వాటికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని.. నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు...