3 Years of YSR Congress Party Rule :  " ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. తాము రాగానే రెండున్నర లక్షల ఖాళీలను భర్తీ చేస్తాయి. జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం " అని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ మూడేళ్ల పాలనలో నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. మూడేళ్లలో జాబ్ క్యాలెండర్ ఒక్క సారే ఇచ్చారు. అందులోనూ గ్రూప్స్ పోస్టులు యాభై కూడా లేవు. అందుకే నిరుద్యోగులు ప్రభుత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. 


గత జూన్‌లో జాబ్ క్యాలెండర్ - కానీ నోటిఫికేషన్లే రావట్లేదు !


జగన్ వస్తారు.. ఉద్యోగం ఇస్తారని రెండున్నరేళ్ల పాటు ఎదురు చూసిన నిరుద్యోగులకు గత జూన్‌లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. అందులో గ్రూప్స్ ఉద్యోగాలు 36 మాత్రమే ఉన్నాయి. యువత ఎక్కువ మంది ఆశలు పెట్టుకునే పోలీసు ఉద్యోగులు నాలుగు వందలే ున్నాయి.  గత మూడేళ్ల నుంచి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ.. కోచింగ్ సెంటర్లకు వేలకు వేలు పెట్టుకుంటున్న నిరుద్యోగుల్లో  అసంతృప్తి ఏర్పడింది. జాబ్ క్యాలెండర్ కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అయితే అసలు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తున్నాయో రావడం లేదో ఎవరికీ తెలియదు.  చాలా వరకూ నోటిఫికేషన్లు రిలీజ్ చేయలేదు. ఏ ఒక్క ఉద్యోగమూ భర్తీ చేయలేదు.   గతంలో 2016, 2018లో గ్రూప్‌-1 ప్రకటన వచ్చింది. 2015, 2018లో గ్రూపు-2 నోటిఫికేషన్‌ ఇచ్చారు. అప్పట్లో మూడేళ్లలోనే రెండుసార్లు ప్రకటన ఇవ్వడంతో యువత పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. 


ఏపీలో లక్షల సంఖ్యలో ఖాళీలు ! 


ఏపీలో యువత మూడేళ్లుగా కోచింగ్‌లోనే ఉన్నారు. ఒక్క పోలీస్ శాఖలోనే ఇరవై వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏటా 6 వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మూడేళ్లుగా ప్రకటనలు లేదు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం.. ఉపాధ్యాయ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది హామీకే పరిమితమైంది. గడిచిన రెండున్నరేళ్లుగా డీఎస్సీ ప్రకటన విడుదల కాలేదు. 2015 డీఎస్సీ ద్వారా జిల్లాలో పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల సహాయకులు, ఎస్జీటీ టీచరు పోస్టులు 1,224 భర్తీ చేశారు. 2018 డీఎస్సీలో 555 ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి.  2018లో డీఎల్, జేఎల్‌ ప్రకటన విడుదల చేశారు. 2018లో విశ్వవిద్యాలయాల్లో 2 వేలకు పైగా పోస్టులకు ప్రకటన ఇవ్వగా తర్వాత నిలిపివేశారు.  గత మూడేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు.  ఇలా పోలీస్, టీచర్ అన్ని విభాగాల్లోనూ కనీసం రెండున్నర లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉంటాయని నిరుద్యోగులు అంచనా వేస్తున్నారు. 


నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం ప్రకటనలు !


ఓ వైపు నోటిఫికేషన్లు రాకపోతూండటానికి తోడు ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం ప్రకటలు చేస్తూండటం యువతను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది.  రెండున్నర లక్షల మంది వాలంటీర్లు, లక్షన్నర మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలనే ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. వాలంటీర్లకు రూ. ఐదు వేలు... గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రూ. పదిహేను వేలు ఇస్తున్నారు. వారికి ఇంకా ప్రొబేషన్ ఇవ్వలేదు.  అయినా అవన్నీ ఉద్యోగాల  భర్తీ ప్రక్రియలో చేర్చేశారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి కొత్తగా ఉద్యోగాలిచ్చినట్లుగా చూపించారు.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొత్త కార్పొరేషన్ కిందకు తెచ్చి కొత్తగా ఉద్యోగాలిచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. కొత్త ఉద్యోగాలేం భర్తీ చేయలేదు.  
 
జిల్లాల విభజనతో ఉద్యోగాల భర్తీకి సాంకేతిక సమస్యలు !
 
కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు  పాత జిల్లాల వారీగా జోన్లను కొనసాగించడానికి చాన్స్ ఉండవు. కొత్త జోన్లను ఖరారు చేసి కేంద్ర హోంశాఖ క్లియర్ చేసి.. రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. అక్కడ సంతకం పని అయిపోతే.. అప్పుడు జోన్లు అమలులోకి వస్తాయి. ఈ జోన్లు ఇటీవల వరకూ అమల్లోకి రాకపోవడం వల్ల తెలంగాణలో ఇప్పటి వరకూ ఉద్యోగాల భర్తీ జరగలేదు. విడుదలైన ప్రతి నోటిఫికేషన్ పై కోర్టు పిటిషన్లు పడ్డాయి. దీంతో ఎక్కడివక్కడ ఆగిపోయాయి. జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఇటీవలే మళ్లీ తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమయింది.  ఎలా చూసినా ఇప్పుడు ఏపీలో ఉద్యోగాల భర్తీ సాధ్యం కాదని.. నోటిఫికేషన్లు వేసినా.. కోర్టు కేసులు పడతాయన్న ఆందోళన వినిపిస్తోంది.