వైఎస్ఆర్‌సీపీ నవరత్నాల అమలే తమ ప్రాధాన్యత అని నేరుగా చెబుతోంది. ఈ మూడేళ్ల కాలంలో నవతర్నాలను ఎంత వరకూ ప్రజలకు చేరువ చేశారు? ఎంత మేర ఈ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి ?సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి ఆ మేరకు పథకాలకు మీట నొక్కుతూంటారు సీఎం జగన్. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ అమలు చేస్తున్నామని.. నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగిస్తున్నామని సీఎం జగన్ చెబుతూఉంటారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గినా మన సంకల్పం ఎక్కడా చెక్కు చెదరలేదు. దీక్ష మారలేదు. ప్రజలకు చేస్తున్న మంచి ఎక్కడా తగ్గనూ లేదని ఓ సందర్భంలో అసెంబ్లీలో చెప్పారు. ఈ నవరత్నాలు మూడేళ్లలో ఎలా అమలవుతున్నాయో ఇప్పుడు చూద్దాం..!
  
 
వైయస్‌ఆర్ రైతు బరోసాలో కలిసిన పీఎం కిసాన్ 


ఈ పథకంతో రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం కింద అందించాలని నిర్ణయించారు. అయితే మేనిఫెస్టో ప్రకటించినప్పుడు మేలో రూ. 12,500 ఒకే సారి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద ఇస్తున్న రూ. ఆరు వేలను కూడా పథకంలో కలిపేశారు. దీంతో ఆరున్నర వేలు తగ్గించినట్లయిందన్న విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంది. అయితే కేంద్రం మూడు విడతలుగా రూ . ఆరు వేలు ఇస్తూండటంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఒకే సారి ఇస్తామన్న హామీ కూడా మారిపోయింది. అయితే ప్రభుత్వం మరో వెయ్యి అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తంగా రైతు భరోసా కింద రూ. ఏడున్నర వేలు, పీఎం కిసాన్ కింద మరో రూ. ఆరు వేలు మొత్తం పదమూడున్నర వేలు రైతులుక పెట్టుబడి సాయం కింద మూడు విడతలుగా అందుతున్నాయి. 


ఆరోగ్యశ్రీ పరిధి విస్తరణ ! 
 
ఆరోగ్యశ్రీ ద్వారా ప్ర వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. వెయ్యి మించిన అన్ని కేసులకు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో మంచి ఆస్పత్రులను ప్రభుత్వం జాబితాలో చేర్చింది.  ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.  హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది.  ఆపరేషన్ చేయించుకున్న లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక చేయూతనందిస్తారు. కిడ్నీవ్యాధి, తలసేమియాతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆయితే ఆచరణలో అందుతున్నాయో లేదో స్పష్టత లేదు. కరోనా చికిత్సను కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది.  దీని వల్ల సామాన్య  ప్రజలకు ప్రయోజనం లభించింది. 



ఫీజు రీయంబర్స్‌మెంట్


1వ తరగతి మొదలు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువుల వరకు పేదవాడి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరించేందుకు ఈ పథకం తీసుకు వచ్చింది. జగనన్న విద్యాదీవెన పేరుతో అమలు చేస్తోంది.  అన్ని సామాజిక వర్గాల విద్యార్థులకు నూరు శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఈ పథకం కింద అందిస్తున్నారు. నాలుగు విడతలుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాలేజీలతో సంబంధం లేకుండా చేయడంతో కొత్త సమస్యలు వస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  ప్రభుత్వం నాలుగు విడుతలు అని చెబుతున్నా.. మూడు విడతలు మాత్రమే విడుదల చేసి.. ఒక్క విడత ఎగ్గొడుతోందన్న ఆరోపణలు ఇతర పక్షఆల నుం చివస్తున్నాయి. 


పేదలందరికీ ఇళ్లు


పేదలందరికీ ఇళ్లు పథకంలో  ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టించాలనినిర్ణయించారు.  ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలాలను పంపిణీ చేసారు.  లక్ష్యం కన్నా ఎక్కువగా ముఫ్పై లక్షల మందికి స్థలాలిచ్చారు.  వైయస్సార్ ఇళ్ల పథకం కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేస్తారు. అయితే మూడేళ్లు పూర్తవుతున్నా ప్రభుత్వం ఇంత వరకూ ఒక్క ఇల్లునూ పూర్తి చేయలేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రూ లక్షా ఎనభై వేలు మాత్రమే ఇస్తాం కట్టుకోవాలని చెబుతోందని లబ్దిదారులు వాపోతున్నారు. కట్టుకోకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామన్న నోటీసులు ఇస్తూండటంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి. 
 


వైయస్‌ఆర్ ఆసరా, వైయస్సార్ చేయూత


ఈ పథకం కింద   పొదుపు సంఘాల రుణం మొత్తాన్ని మాఫీ చేస్తారు. అయితే రుణం ఎంత ఉందో అంత.. డ్వాక్రాసభ్యులకే ఇస్తున్నారు.  వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రూ. పదిహేను వేలు ఇస్తున్నారు. నాలుగేళ్లలో రూ.75 వేలు దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లబ్దిదారులు అతి తక్కువగా ఉండటంతో తమకు పథకం అందలేదని విమర్శలు చేసే వారే ఎక్కువగా ఉన్నారు. 


సామాజిక  పించన్ల పెంపు 


 పింఛన్ తీసుకోవడానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. సీఎంగా ప్రమాణం చేసిన రోజున రూ. రెండు వేలు ఉన్న పెన్షన్‌ను రూ.  రూ. 2,250 పెంచుతున్నట్లుగా ప్రకటించారు. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇటీవల  రూ. 2,500 చేశారు. వచ్చే ఏడాది మరో రూ. 2750 పెంచుతామని ప్రకటించింది.  ముఖ్యమంత్రిగా జగన్ తొలి సంతకం దీనిపైనే చేశారు.  దివ్యాంగులకు రూ.3000 పింఛన్ పెంచారు. డయాలసిస్ రోగులకు రూ. 3,500 నుంచి రూ. 10,000కు పెంచారు. వితంతువులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ను రూ. 2,250కు పెంచారు.
 


అమ్మఒడి


ప్రభుత్వ, ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థులకే కాదు, ఇంటర్ విద్యార్థులకు సైతం అమ్మఒడి వర్తిస్తుంది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా అందిస్తున్నారు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఈ పథకం అమలులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. చెబుతోంది రూ. పదిహేను వేలు అయినప్పటికీ స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ. వెయ్యి తగ్గించి ఇస్తున్నారు. ఈ ఏడాది మరో రూ. వెయ్యి తగ్గించాలని నిర్ణయించారు. దీంతో పాటు ఈ ఏడాది లబ్దిదారులను కూడా తగ్గించడానికి రకరకాల నిబంధనలు పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. 



మద్య నిషేధం


మూడు దశల్లో మద్యాన్ని నిషేధించి, మధ్యాన్ని 5 స్టార్ హోటల్స్‌కి మాత్రమే పరిమితం చేయడం నవరత్నాల్లో ఒకటి. కానీ ఇంత వరకూ ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. కానీ మద్యం రేట్లను విపరీతంగా పెంచి విమర్శలకు గురవుతోంది. పైగా మద్యం ఆదాయాన్ని హామీగా పెట్టి పాతికేళ్ల పాటు కట్టేలా అప్పు తీసుకు వచ్చారు. దీంతో నవరత్నాల్లో మద్య నిషేధం అమలు అసాధ్యమని తేలిపోయిందన్న వాదన వినిపిస్తోంది.  
 
 జలయజ్ఞం 


జలయజ్ఞంలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ రివర్స్ టెండర్ల కారణంగా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పోలవరం దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. అవుకు స్వరంగాన్ని పూర్తి చేస్తూ ఒక సంవత్సరంలో గాలేరు-నగరి ప్రాజెక్టు ఒకటవ దశను పూర్తి చేసేందుకు గండికోట రిజర్వాయర్‌లో నీటి నిల్వ, కడప జిల్లాలోని ఆయకట్టు దారులకు నీటి సరఫరా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కానీ మూడేళ్లయినా పనులుపూర్తి కాలేదు.  వెనుకబడిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సత్వర సాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు వంశధార, సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అడుగులు ముందుకు పడలేదు.