Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణలో బోనాల పండుగ మొదలైంది. ఆషాఢ మాస దశాబ్ది బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీ శ్రీ జగదాంబిక మహంకాళీ గోల్కొండ బోనాలు ఆదివారం (జులై 7న) ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు.
ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజ, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గోల్కొండ బోనాల ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించిన వారిలో ఉన్నారు. నగరంలోని లంగర్‌హౌజ్ చౌరస్తా నుంచి పట్టు వస్త్రాలు, తొట్టెలు ఊరేగింపు కార్యక్రమం గోల్గొండ కోట వరకూ కొనసాగింది.
గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పణ కార్యక్రమంతో గోల్కొండ ఆషాఢ బోనాలు మొదలయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాల వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు మంత్రులు విజ్ఞప్తి చేశారు.
డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాల కోలాహలం మధ్య కొండపైకి తొట్లు, రథం ఊరేగింపు చేరింది. వర్షాలు బాగా కురిసి, పాడి పంటలతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.