PV Sindhu In Hyderabad: కాంస్యంతో హైదరాబాద్‌కు సింధు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం
ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తన కోచ్ అయిన పార్క్ తే సంగ్‌తో కలిసి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సింధూకు క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఘన స్వాగతం పలికారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాక పీవీ సింధు తొలిసారి హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సింధూకు ప్రముఖులతో పాటు అభిమానులు ఘనంగా స్వాగతించారు.
సింధు రాకతో శంషాబాద్ విమానాశ్రయంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వచ్చే ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణ పతకం సాధించాలని ఆకాంక్షించారు. గతంలో రజత పతకం గెల్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకాల ప్రకారం త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో మంచి క్రీడా విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పీవీ సింధు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు.
సింధు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అందరి ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని సింధు విశ్వాసం వ్యక్తం చేశారు.
గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేయడం తనకు ఎంతగానో ఉపయోగపడిందని సింధు అన్నారు. కరోనా సమయంలో పలు రకాల ఒత్తిళ్లను, భయాలను పక్కన పెట్టి ఆటపైనే దృష్టిసారించినట్లు సింధు తెలిపారు.
అంతకుముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీవీ సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు.
పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2017-22 స్పోర్ట్స్ పాలసీ ప్రకారం సింధుకు రూ.30 లక్షలు నజరానా అందించాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.