Voter Card Rules: మీరు 2 ఓటర్ కార్డులు కలిగి ఉన్నారా? జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మీకు తెలుసా..
భారతదేశంలో ఓటర్ కార్డు ముఖ్యమైన ఓ గుర్తింపు కార్డు. 18 సంవత్సరాలు నిండిన వారైతే, మీరు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డ్ లేకపోతే మీకు ఓటు హక్కు ఉండదు.
భారతదేశంలో 18 ఏళ్లు నిండిన వయోజనులకు ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు అవకాశాన్ని కల్పిస్తుంది. ఓటర్ కార్డ్ ఉన్న వారు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఒకవేళ ఎవరికైనా రెండు ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉంటే లేదా రెండో ఓటర్ కార్డు కోసం ప్రయత్నిస్తే.. అలా చేయడం చట్టపరమైన నేరం అవుతుంది.
చాలా మంది వేర్వేరు చిరునామాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటర్ కార్డులు కలిగి ఉంటారు. కానీ అలా చేయడం సరికాదు. ఒకే రాష్ట్రంలోనూ కొందరి పేరిట ఒకటికి మించి ఓటర్ కార్డులు ఉంటున్నాయి. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఒక పౌరుడు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటర్ల జాబితాలో మాత్రమే ఉండాలి.
రెండు చోట్ల ఓటర్ జాబితాలో పేర్లు ఉండటం లేదా రెండు ఓటర్ కార్డులు కలిగి ఉండటం మోసంగా భావిస్తారు. ఇది ఎన్నికల ప్రక్రియ యొక్క పారదర్శకత, నిష్పాక్షికతపై ప్రభావం చూపుతుంది. అలా చేస్తే, BNS సెక్షన్ 182, ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్లు 17, 31 కింద శిక్షార్హులు అవుతారు. దోషిగా తేలితే జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
వేర్వేరు నగరాల్లో నివసిస్తున్నప్పుడు చాలా సార్లు ప్రజలు కొత్త ఓటరు కార్డును తీసుకుంటారు. కానీ పాత ఓటర్ కార్డును రద్దు చేయించరు. పొరపాటున లేదా సమాచారం లేకపోవడం వల్ల మీరు రెండు ఓటర్ కార్డులు కలిగి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫారం 7 నింపి పాత ఓటరు కార్డును రద్దు చేసుకునే వీలుంటుంది.
ఫారం 7 నింపేటప్పుడు మీరు ఏ ఓటర్ కార్డును తొలగించాలనుకుంటున్నారు, అందుకు కారణం తెలిపితే సరిపోతుంది. దీనితో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ కూడా సమర్పించాలి. ప్రక్రియ పూర్తయితే రికార్డ్ అప్డేట్ చేయబడుతుంది మరియు మీ వద్ద ఒక్క ఓటర్ కార్డు మాత్రమే ఉంటుంది.