Happy New Year 2026 : కొత్త సంవత్సరం జనవరి 1న మాత్రమే ఎందుకు జరుపుకుంటారు? ఈ ఆచారం ఎప్పటినుంచి మొదలైందో తెలుసా?
ప్రాచీన రోమ్‌లోని తొలి క్యాలెండర్లలో కేవలం 10 నెలలు మాత్రమే ఉండేవి. దీనితో పాటు సంవత్సరం మార్చి 1న ప్రారంభమయ్యేది. ఇది వసంతకాలపు వ్యవసాయం, యుద్ధ కాలానికి సంబంధించినది. పండుగలు, సైనిక కార్యకలాపాలు, పౌర విధులు అన్నీ ఈ మార్చి ఆధారిత క్యాలెండర్ ప్రకారం నిర్వహించేవారు.
సుమారు 700 BCE లో రోమన్ రాజు నుమా పోంపిలియస్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చాడు. చాలాకాలం తరువాత 153 BCEలో రోమన్ సెనేట్ అధికారికంగా రాజకీయ సంవత్సరం ప్రారంభాన్ని జనవరి 1వ తేదీకి మార్చారు. తద్వారా కొత్తగా ఎన్నికైన అధికారులు ముందుగా పదవీ బాధ్యతలు స్వీకరించేవారు. మిగిలిన సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమయ్యేవారు.
జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాడు. దీనితో క్యాలెండర్ సౌర సంవత్సరంతో సరిపోలడం ప్రారంభించింది. దాంతో అతను అధికారికంగా జనవరి 1ని సంవత్సరం మొదటి రోజుగా ప్రకటించాడు. ఇది రోమన్ దేవుడు జాన్సన్ గౌరవార్థం జరిగింది. ఈ సంస్కరణే లీప్ సంవత్సరం భావనను కూడా ప్రవేశపెట్టింది. దీని కారణంగా సమయం గణన మరింత ఖచ్చితంగా మారింది.
రోమన్ సామ్రాజ్యం పతనమైన వెంటనే మధ్యయుగ క్రైస్తవ అధికారులు జనవరి 1ని ఒక అన్యుల సంప్రదాయంగా భావించారు. యూరప్‌లోని చాలా ప్రాంతాలు దీనికి బదులుగా డిసెంబర్ 25 లేదా మార్చి 25 న నూతన సంవత్సరం జరుపుకోవడం ప్రారంభించాయి.
1582లో పోప్ గ్రెగొరీ XIII జూలియన్ వ్యవస్థలో లోపాలను సరిచేయడానికి గ్రెగొరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణ జనవరి 1ని అధికారిక నూతన సంవత్సరంగా తిరిగి ప్రారంభించింది. కాథలిక్ దేశాలు వెంటనే దీనిని స్వీకరించాయి. అయితే మిగిలిన దేశాలు చాలా ఆలస్యంగా స్వీకరించాయి. బ్రిటన్ దీనిని 1752లో రష్యా 1918లో, గ్రీస్ 1923లో స్వీకరించాయి.
దీంతో ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న కొత్త సంవత్సరం జరుపుకుంటున్నారు. అయితే అనేక సంస్కృతులు తమ సంప్రదాయ క్యాలెండర్ల ఆధారంగానే నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి. చైనా నూతన సంవత్సరం చంద్ర చక్రాన్ని అనుసరిస్తుంది. హిందువుల చైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. ఇస్లామిక్ నూతన సంవత్సరం మొహర్రం నెలతో ప్రారంభమవుతుంది.