Booking Train Ticket : టికెట్ కన్ఫార్మ్ కాకున్నా రైలులో ప్రయాణం చేయవచ్చా? ఎమర్జెన్సీ సమయంలో ఫాలో అయిపోండి
మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే.. మీరు అసలు రైలులో ప్రయాణించలేరని కాదు. అలా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పుడు ప్రయాణం కోసం రైల్వే కొన్ని ఆప్షన్లు ఇచ్చింది. అయితే మీరు దానికోసం కొన్ని విధానాలు అనుసరించాల్సి ఉంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రయాణించాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
ముందుగా తత్కాల్ కోటాలో ట్రై చేయవచ్చు. రైల్వే ప్రతిరోజూ కొన్ని టిక్కెట్లను తత్కాల్ కోటాలో అందుబాటులో ఉంచుతుంది. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణించవచ్చు. ఈ టిక్కెట్లు కొంచెం ఖరీదైనవి. కానీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అకస్మాత్తుగా వెళ్లవలసి వస్తే, సాధారణ బుకింగ్‌లో టిక్కెట్లు దొరకకపోతే ఇది బెస్ట్.
అదనంగా ప్రీమియం తత్కాల్ కోటా కూడా అందుబాటులో ఉంది. ఇందులో ఛార్జీలు కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ కన్ఫర్మ్ టికెట్ త్వరగా లభిస్తుంది. సమయం తక్కువగా ఉన్నా.. రైళ్లలో సీట్లు పరిమితంగా మిగిలి ఉన్న ప్రయాణికులకు ఇది బెస్ట్. ఆన్లైన్ పోర్టల్, రైల్వే కౌంటర్ రెండింటి ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చు.
మీ టికెట్ RAC రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్‌లో ఉంటే.. మీరు రైలులో ప్రయాణించవచ్చు. అయితే ఈ సమయంలో మీరు బెర్త్ పంచుకోవాల్సి ఉంటుంది. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఏ ప్రయాణికుడు టికెట్ రద్దు చేసినా.. RAC టికెట్ తనంతట అదే ఫుల్ సీటుగా మారుతుంది.
చార్ట్ తయారైన తర్వాత కూడా సీటు ఖాళీగా ఉంటే రైల్వే వాటిని కరెంట్ బుకింగ్ లేదా వెయిటింగ్ లిస్ట్ ఉన్నవారికి కేటాయిస్తుంది. అందుకే చివరి నిమిషం వరకు టికెట్ స్టేటస్ చెక్ చేస్తూ ఉండటం ముఖ్యం. చాలాసార్లు ప్రజలకు చివరి క్షణాల్లో కన్ఫర్మ్డ్ బెర్త్ లభిస్తుంది. దీనివల్ల ప్రయాణం సులభంగా జరుగుతుంది.
ఏదైనా కారణం వల్ల పైన పేర్కొన్న అన్ని ఎంపికలు పని చేయకపోతే.. మీరు సాధారణ టికెట్ కొనుగోలు చేయడం ద్వారా కూడా ప్రయాణించవచ్చు. అయితే మీరు రిజర్వేషన్ లేని బోగీలో కూర్చోవాల్సి ఉంటుంది. సుదూర ప్రయాణాలకు ఇది అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది.