Christmas 2025 : ఈ దేశాలలో క్రిస్మస్ జరుపుకుంటే అరెస్ట్ అవుతారట.. క్రిస్మస్ చెట్టు పెట్టినా శిక్షే, కారణాలు ఇవే
బ్రూనైలో క్రిస్మస్ జరుపుకోవడంపై అత్యంత కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఇక్కడ క్రిస్మస్ చెట్లు, అలంకరణలు లేదా పండుగ దుస్తులు వంటి బహిరంగ ప్రదర్శనలపై నిషేధం ఉంది. ఎవరైనా నియమం ఉల్లంఘిస్తే.. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించవచ్చు.
ఉత్తర కొరియాలో క్రిస్మస్ పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఇక్కడ అన్ని మతపరమైన కార్యకలాపాలు నిషేధించారు. క్రైస్తవ మతానికి సంబంధించిన ఏ రకమైన వేడుకలు, ప్రార్థనలు లేదా సమావేశాలు నిర్వహించినా అరెస్టు చేస్తారు. జైలు శిక్ష విధించవచ్చు. అంతేకాకుండా మతపరమైన చిహ్నాలను కలిగి ఉండటం కూడా ఇక్కడ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
సోమాలియా 2015లో భద్రతాపరమైన కారణాలు, మతపరమైన కారణాలను ఉటంకిస్తూ క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించింది. ఇక్కడ ఇలాంటి వేడుకలు ఇస్లామిక్ సంస్కృతికి వ్యతిరేకం అని అధికారులు వాదిస్తున్నారు. బహిరంగ వేడుకలు జరుపుకుంటే నిర్బంధించవచ్చు లేదా జైలుకు పంపవచ్చు.
సౌదీ అరేబియా ఇటీవల కాలంలో సామాజిక ఆంక్షలను సడలించినప్పటికీ.. బహిరంగ క్రిస్మస్ వేడుకలు ఇప్పటికీ చట్టబద్ధంగా అనుమతించలేదు. రహస్యంగా, వ్యక్తిగతంగా జరుపుకోవడానికి అనుమతి ఉంది. కాని బహిరంగ ప్రదర్శనపై ఇప్పటికీ నిషేధం ఉంది.
కజకిస్తాన్‌లో క్రిస్మస్ పండుగ సందర్భంగా చెట్లు అలంకరించడం, బాణసంచా కాల్చడం, ప్రత్యేక వంటలు చేసుకోవడం, ఫాదర్ క్రిస్మస్ వంటి బహిరంగ వేడుకలపై నిషేధం విధించారు. ఈ ఆచారాలు జాతీయ సంస్కృతికి విరుద్ధమని అధికారులు చెబుతున్నారు.
లిబియా, భూటాన్లలో కూడా క్రిస్మస్ సెలవు దినం లేదు. బహిరంగ వేడుకలపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా జరుపుకోవడంపై అరెస్టులు ఉండకపోవచ్చు. కానీ బహిరంగ వేడుకలు జరుపుకుంటే చట్టపరమైన లేదా పరిపాలనాపరమైన చర్యలు ఖచ్చితంగా ఉండవచ్చు.