Papaya Side Effects : ఆ 5 సమస్యలున్నవారు బొప్పాయి తింటే ఆరోగ్యానికి హానికరమట.. నిపుణులు చెప్తోన్న నిజాలివే
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ.. అందరికీ మంచిది కాకపోవచ్చు. కొందరికి దీనిని తినడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మోతాదులో లేదా పచ్చిగా తింటే సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే నిపుణులు ఈ రకాల సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినవద్దని చెప్తున్నారు.
గర్భధారణ సమయంలో.. పండని లేదా సగం పండిన బొప్పాయిని, పచ్చిగా ఉండే బొప్పాయిని తినకూడదని చెప్తున్నారు. ఇందులో లేటెక్స్, పాపెయిన్ అధికంగా ఉంటుంది. ఇవి గర్భాశయంలో సంకోచాలను కలిగిస్తాయి. ఇది అకాల ప్రసవానికి లేదా ఇతర సమస్యలకు దారి తీసే అవకాశముంది. కాబట్టి వైద్యులు గర్భిణీ స్త్రీలు బొప్పాయి తినకూడదని సూచిస్తారు.
బొప్పాయిలో కొన్ని సహజ సమ్మేళనాలు.. జీవక్రియ సమయంలో హైడ్రోజన్ సైనైడ్ను విడుదల చేస్తాయి. సాధారణ ఇది హానికరం కాదు. కానీ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కువ బొప్పాయి తినడం వల్ల గుండె సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది.
లేటెక్స్ అలర్జీ ఉంటే బొప్పాయి తినకపోవడమే మంచిది. వాస్తవానికి బొప్పాయిలో ఉండే ప్రోటీన్లు లేటెక్స్‌లో కనిపించే ప్రోటీన్లకు చాలా దగ్గరగా ఉంటాయి. ఆ సమయంలో శరీరం క్రాస్-రియాక్షన్ జరగవచ్చు. దీనివల్ల దురద, తుమ్ములు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఇందులో ఉండే కొన్ని అంశాలు థైరాయిడ్ హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తాయి. దీనివల్ల అలసట, నీరసం, చలిని భరించలేకపోవడం వంటి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.
బొప్పాయిలో విటమిన్ సి ఎక్కువ లభిస్తుంది. సాధారణ ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఇది హానికరం. వాస్తవానికి, ఎక్కువ విటమిన్ సి శరీరంలో ఆక్సలేట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుంది.