Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి

మొదటిసారి జిమ్ చేయాలనుకునేవారికి టిప్స్
బరువు తగ్గాలా, కండరాలు పెంచుకోవాలా లేదా ఫిట్‌గా ఉండాలా అనేది ముందుగా నిర్ణయించుకోండి. ఒకే వర్కవుట్ అందరికీ సరిపోదు కాబట్టి మీ లక్ష్యానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలి.
మొదట్లో ఉత్సాహంతో ఎక్కువ బరువులు ఎత్తడం లేదా ఎక్కువసేపు కార్డియో చేయడం వల్ల కండరాల నొప్పి, గాయాలు రావచ్చు. కాబట్టి తక్కువ తీవ్రతతో ప్రారంభించి క్రమంగా వర్కవుట్‌ను పెంచడం మంచిది.
ఎంత బరువు ఎత్తుతున్నామన్నదానికంటే దాన్ని సరైన పద్ధతిలో చేయడం ముఖ్యం. స్క్వాట్స్, డెడ్‌లిఫ్ట్స్ వంటి వ్యాయామాలను తప్పు ఫామ్‌తో చేస్తే గాయాల ప్రమాదం పెరుగుతుంది. మొదట్లో ట్రైనర్ పర్యవేక్షణలో నేర్చుకోవడం మంచిది.
వర్కవుట్ ప్రారంభించే ముందు కొన్ని నిమిషాలు వార్మప్ చేయాలి. వ్యాయామం తర్వాత శరీరం నెమ్మదిగా సాధారణ స్థితికి రావడానికి కూల్‌డౌన్ చేయడం కూడా అంతే అవసరం.
మీ పక్కన ఉన్న వాళ్లతో పోల్చుకోవద్దు. వాళ్లు ఎక్కువ బరువు ఎత్తుతున్నాడని మీరు కూడా అదే ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఫిట్‌నెస్ స్థాయి వేరు. మీ శరీర సామర్థ్యాన్ని బట్టి ముందుకు వెళ్లాలి.
జిమ్‌లో చేరగానే కఠినమైన డైట్ లేదా అవసరం లేని సప్లిమెంట్లు ప్రారంభించవద్దు. సమతుల్య ఆహారంలో తగినంత ప్రోటీన్, కూరగాయలు, పండ్లు ఉండేలా మాత్రం చూసుకోవాలి. అలాగే ప్రోటీన్ పౌడర్ అందరికీ అవసరం కాదు.
రోజూ గంటల తరబడి వ్యాయామం చేయడమే ఫిట్‌నెస్ కాదు. కండరాల రికవరీకి విశ్రాంతి, సరైన నిద్ర అవసరం. శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా నిరంతరం కఠినంగా వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనం కంటే సమస్యలు రావచ్చు.
వ్యాయామం చేస్తున్నప్పుడు తీవ్రమైన ఛాతీ నొప్పి, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆపాలి. అవసరమైతే వైద్య సహాయం తీసుకోవాలి.