Low Blood Sugar : అకస్మాత్తుగా షుగర్ తగ్గితే జాగ్రత్త.. ఈ లక్షణాలు అస్సలు విస్మరించకండి
చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గడం సాధారణంగా మధుమేహం ఉన్నవారిలో కనిపిస్తుంది. కానీ ఇది ఇతరులలో కూడా సంభవించవచ్చు. సకాలంలో గుర్తించకపోతే, చికిత్స చేయకపోతే.. రోగి ఆలోచనా సామర్థ్యం, శరీర పనితీరును ప్రభావితం చేస్తుంది.
హైపోగ్లైసీమియా అంటే శరీరంలో చక్కెర సాధారణ స్థాయి కంటే తగ్గడం. సాధారణ చక్కెర స్థాయి సుమారు 80 mg/dL లేదా అంతకంటే ఎక్కువ. వృద్ధులకు లేదా ఇతర వ్యాధులు ఉన్నవారికి ఈ స్థాయి కొంచెం ఎక్కువగా ఉండాలి. చక్కెర 70 mg/dLకి చేరుకున్నప్పుడు శరీరం మనకు హెచ్చరికలు ఇవ్వడం ప్రారంభిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం ప్రారంభించినప్పుడు శరీరం కొన్ని సంకేతాలను పంపుతుంది. చలిగా అనిపించడం, చెమటలు పట్టడం, చేతులు, కాళ్లలోవణుకు.. గుండె వేగంగా కొట్టుకోవడం వంటివి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే శ్రద్ధ తీసుకుని షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
షుగర్ 55 mgdL కన్నా తగ్గితే అది ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఈ స్థితిలో వ్యక్తి సరిగ్గా ఆలోచించలేడు. మాట్లాడటం, నడవడంలో ఇబ్బంది కలుగుతుంది. సమయానికి చికిత్స చేయకపోతే ప్రాణానికి ప్రమాదం కలగవచ్చు.
అకస్మాత్తుగా చక్కెర తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు. తక్కువ ఆహారం తీసుకోవడం లేదా ఆహారం తీసుకోవడం మానేయడం, అకస్మాత్తుగా లేదా ఎక్కువ శారీరక శ్రమ చేయడం వంటివి కారణాలు కావచ్చు. మందుల మోతాదు ఎక్కువగా తీసుకోవడం, ఇన్సులిన్, ఇతర వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ల వల్ల శరీర శక్తి వేగంగా క్షీణిస్తుంది. వీటివల్ల చక్కెర స్థాయిలు పడిపోతాయి.
చక్కెర తగ్గితే.. రోగి స్పృహలో ఉంటే వెంటనే 20 నుంచి 30 గ్రాముల కార్బోహైడ్రేట్లను ఇవ్వండి. రసం, పండ్లు లేదా గ్లూకోజ్ మాత్రలు వంటివి ఇవ్వాలి. రోగి స్పృహ కోల్పోయినట్లయితే.. ఆహారం ఇవ్వకూడదు. బదులుగా ఇంట్లో గ్లూకాగాన్ ఇంజెక్షన్ ఉపయోగించండి. అరగంట తర్వాత మళ్లీ చక్కెర స్థాయిని తనిఖీ చేయండి. మెరుగుదల లేకపోతే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లండి.
హైపోగ్లైసీమియా, డయాబెటిస్ నియంత్రణ కోసం ఆకుకూరలు, బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా, చికెన్, చేపలు, పప్పులు, గింజలు, విత్తనాలు, తక్కువ కొవ్వు కలిగిన పాల ఉత్పత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు తినండి. వీలైనంత ఎక్కువ నీరు తాగండి. శుద్ధి చేసిన చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, తెల్ల రొట్టె, మిఠాయిలు, ఫాస్ట్ ఫుడ్లకు దూరంగా ఉండండి. సమతుల్య ఆహారం, రెగ్యులర్ బ్లడ్ షుగర్ మానిటరింగ్, మందులను సరిగ్గా వాడటం హైపోగ్లైసీమియాను నివారించడంలో సహాయపడుతుంది.