BP Reducing Tips : బీపీని సహజంగా తగ్గించే ఇంటి చిట్కాలు.. రక్తపోటు ఎక్కువగా ఉంటే ఫాలో అయిపోండి
నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. రక్తాన్ని పలుచగా చేస్తుంది. గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, చెమట ఎక్కువగా పడుతున్నప్పుడు నీటిని శరీరానికి అందించాలి.
ఆహారంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అరటి, నారింజ, ఆపిల్, పాలకూర, టమోటాలు, కీరదోస రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలకు బదులుగా ఇంట్లో తయారుచేసిన ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి.
అధిక రక్తపోటును నియంత్రించడానికి శరీరాన్ని యాక్టివ్గా ఉంచడం సులభమైన మార్గం. కాబట్టి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వేగంగా నడవండి. లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను బలంగా ఉంచుతుంది.
కాఫీ, టీ, మద్యం ఎక్కువగా తీసుకుంటే హార్ట్ బీట్, రక్తపోటు రెండూ పెరుగుతాయి. కాబట్టి వాటి మోతాదును నెమ్మదిగా తగ్గించండి. ఆల్కహాల్ పూర్తిగా మానేస్తే మంచిది.
నేటి బిజీ లైఫ్లో ఒత్తిడి కామన్ సమస్య అయిపోయింది. ఇది రక్తపోటుకు ప్రధాన కారణం అవుతుంది. యోగా, ధ్యానం, డీప్ బ్రీత్ తీసుకోవడం, సంగీతం వినడం లేదా పుస్తకం చదవడం కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి.
నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటులో మార్పులు ఉంటాయి. ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు బాగా నిద్రపోండి. నిద్రపోయే, మేల్కొనే సమయాన్ని క్రమం తప్పకుండా పాటించండి. అర్ధరాత్రి వరకు మొబైల్ ఉపయోగించే అలవాటును మానుకోండి.
ఊబకాయం అధిక రక్తపోటుకు ప్రధాన కారణం. సమతుల్య ఆహారం, వ్యాయామంతో బరువు తగ్గడానికి ప్రయత్నించండి. అలాగే ధూమపానం చేస్తుంటే వెంటనే మానేయండి. ఎందుకంటే స్మోకింగ్ రక్త నాళాలను బలహీనపరుస్తుంది. బీపీని వేగంగా పెంచుతుంది.