Geyser Safety Tips : వేడి నీళ్లకోసం గీజర్ వాడుతున్నారా? అయితే ఆ తప్పులు చేయకండి.. లేదంటే బ్లాస్టే
గీజర్ పేలిపోవడానికి ప్రధాన కారణం హెవీ ప్రెజర్, సరిగ్గా పనిచేయని థర్మోస్టాట్ సిస్టమ్. గీజర్ లోపల నీరు అవసరమైన దానికంటే ఎక్కువ వేడిగా మారినప్పుడు ఆవిరి వస్తుంది. దానివల్ల ప్రెజర్ పెరుగుతుంది. సేఫ్టీ వాల్వ్ సరిగ్గా పనిచేయకపోయినా లేదా దానిని బ్లాక్ చేసినా ప్రెజర్ పెరిగి.. గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది.
చాలా మంది ఎలక్ట్రిక్ గీజర్లను ఎక్కువ సమయం పాటు ఆన్ చేస్తారు. లేదా తడి చేతులతో దాని స్విచ్ వేస్తారు. ఇది తప్పు. ఎందుకంటే తేమ, కరెంట్ చాలా ప్రమాదకరం. గీజర్ వైరింగ్ సిస్టమ్ పాతది లేదా దెబ్బతిన్నది అయితే కరెంట్ బాత్రూమ్ అంతా వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. కాబట్టి గీజర్ వైరింగ్, ఎర్తింగ్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి.
గ్యాస్ గీజర్ నేటికీ చాలామంది వాడతారు. కానీ అది ఎలక్ట్రిక్ గీజర్ కంటే ప్రమాదకరం. గ్యాస్ గీజర్ ఆక్సిజన్ వినియోగించి కార్బన్ మోనాక్సైడ్ విడుదల చేస్తుంది. బాత్రూంలో వెంటిలేషన్ లేకపోతే.. కార్బన్ మోనాక్సైడ్ లోపల నిండి ఊపిరాడకుండా చేస్తుంది.
గీజర్ ఉపయోగించే ముందు దాని సర్వీస్ చేయించుకోండి. ఒకవేళ గీజర్ నుంచి ఏదైనా శబ్దం వస్తుంటే లేదా నీరు లీక్ అవుతుంటే వెంటనే దాన్ని ఆపివేయండి. స్నానాల గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా కిటికీ తెరిచి ఉంచండి. దీనివల్ల గ్యాస్ లేదా వేడి ఆవిరి బయటకు పోతుంది. ఎలక్ట్రిక్ గీజర్ ఉపయోగిస్తుంటే.. స్నానం చేసేటప్పుడు దాన్ని ఆన్ చేయవద్దు. ముందుగా నీటిని వేడి చేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేయాలి.
గీజర్ శీతాకాలంలో ఒక ముఖ్యమైన పరికరం. కానీ దానిని సరిగ్గా ఉపయోగించకపోతే మీ భద్రతకు ప్రమాదం కావచ్చు. కొంచెం నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. కాబట్టి శీతాకాలంలో మీ కుటుంబ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి.