Blood-Written Letters : రక్తంతో లెటర్ రాయడం కూడా నేరమేనట.. ఏ సెక్షన్ల కింద శిక్ష పడొచ్చో తెలుసా?
ఒక వ్యక్తి సంస్థ లేదా ప్రభుత్వ అధికారిని బెదిరించడానికి లేదా ఒత్తిడి చేయడానికి లేదా మానసికంగా భయపెట్టడానికి రక్తం ఉపయోగించి లెటర్ రాస్తే.. అది భారతీయ న్యాయ స్మృతి సెక్షన్ 351 ప్రకారం నేరపూరిత బెదిరింపుగా పరిగణిస్తారు.
రక్తంతో రాసిన లేఖలో మరణం, తీవ్ర గాయం లేదా ఆస్తికి నష్టం కలిగించే బెదిరింపులు ఉంటే.. నేరాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష వేస్తారు. జరిమానా విధించవచ్చు. చట్టం కేవలం పంపిన వ్యక్తి ఉద్దేశంపైనే కాకుండా.. చదివిన వ్యక్తి మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై కూడా దృష్టి పెడుతుంది.
రక్తం తో రాయడానికి ఒక వ్యక్తి తనను తాను గాయపరచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి, అధికారం లేదా సంస్థపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ పని చేస్తే.. భారతీయ న్యాయ స్మృతిలోని సెక్షన్ 226 వర్తిస్తుంది. దీని కింద జరిమానా లేదా జైలు శిక్ష విధించవచ్చు.
రక్తంతో రాసిన లేఖను బహిరంగంగా ప్రచారం చేసినా.. ప్రదర్శించినా లేదా భయం, ఆందోళన లేదా సామాజిక అశాంతిని కలిగించే విధంగా షేర్ చేసినా.. అది భారతీయ న్యాయ స్మృతి సెక్షన్ 196 కిందకు రావచ్చు. బహిరంగ శాంతి లేదా మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసినప్పుడు ఈ సెక్షన్ ఉపయోగిస్తారు.
ఒక మహిళకు రక్తంతో రాసిన లెటర్ పంపిస్తే.. దాని వలన ఆమె పదేపదే భయానికి, భావోద్వేగ సమస్యలకు లేదా మానసిక ఒత్తిడికి గురైతే.. దీనిని భారతీయ న్యాయ స్మృతిలోని సెక్షన్ 78 ప్రకారం మానసిక వేధింపులు లేదా వెంబడించడంగా పరిగణిస్తారు.
మనిషి రక్తాన్ని బయోహజార్డ్ గా పరిగణిస్తారు. దీనిని పోస్టల్ లేదా కొరియర్ సేవల ద్వారా పంపడం ఆరోగ్య, భద్రతా నిబంధనలను ఉల్లంఘించడమే. దీనివల్ల పంపేవారిపై అదనపు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా సోషల్ మీడియాలో రక్తం ద్వారా రాసిన లేఖ చిత్రాన్ని లేదా వీడియోను పోస్ట్ చేస్తే.. ఐటీ చట్టం కింద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఇందులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం.. అకౌంట్ సస్పెండ్ చేయడం, హింస లేదా బెదిరింపుల కంటెంట్ను తొలగించడం వంటివి ఉంటాయి.