Babies Health : పుట్టిన తరువాత పిల్లలు ఎందుకు ఏడుస్తారు? ఎందుకు నవ్వరు?
శిశువు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు.. వాళ్లు పూర్తిగా కొత్త ప్రపంచంలోకి అడుగు పెడతారు. గర్భంలో ఉష్ణోగ్రత, కాంతి, శబ్దాలు డిఫరెంట్గా ఉంటాయి. అయితే బయటి ప్రపంచం చల్లగా, ప్రకాశవంతంగా, శబ్దంతో నిండి ఉంటుంది.
ఈ ఆకస్మిక మార్పుకు శిశువు శరీరం తక్షణమే స్పందిస్తుంది. ఈ స్పందన ఏడుపు రూపంలో వ్యక్తమవుతుంది. ఇది శిశువు జీవించి ఉన్నారని, వారి శరీరం కొత్త వాతావరణానికి అనుగుణంగా ఉందనీ సూచిస్తుంది.
వైద్యుల ప్రకారం.. శిశువు మొదటి ఏడుపు అతని ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన సూచనగా చెప్తారు. గర్భంలో ఉన్నప్పుడు.. బిడ్డ ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయవు. ఎందుకంటే అతనికి ఆక్సిజన్ బొడ్డు తాడు ద్వారా అందుతుంది.
పుట్టిన వెంటనే శిశువు తనంతట తానుగా శ్వాస తీసుకోవాలి. ఏడుస్తున్నప్పుడు బిడ్డ గట్టిగా గాలి పీల్చుకుని వదిలినప్పుడు, వారి ఊపిరితిత్తులు విస్తరిస్తాయి. వాటిలో ఉన్న ద్రవం బయటకు వస్తుంది. ఇదే ప్రక్రియ అతన్ని స్వతంత్రంగా శ్వాస తీసుకునేలా చేస్తుంది.
మొదటి ఏడుపు కేవలం శబ్దం మాత్రమే కాదు.. శరీరంలో లోతైన మార్పు కూడా జరుగుతుంది. ఈ ఏడుపుతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్త ప్రసరణ కొత్త చక్రం ప్రారంభమవుతుంది. శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ చేరుకుంటుంది.
అందుకే చాలాసార్లు డాక్టర్లు బిడ్డ ఏడవడం కోసం ఎదురు చూస్తారు. ఎందుకంటే ఇది గుండె, ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేస్తున్నాయనడానికి రుజువు. బిడ్డ ఎందుకు నవ్వడు అనే ప్రశ్న తరచుగా వస్తుంది. వాస్తవానికి నవ్వు అనేది ఒక భావోద్వేగ, సామాజిక ప్రతిస్పందన. ఇది మెదడు అభివృద్ధికి సంబంధించినది.
పుట్టినప్పుడు శిశువు మెదడు ప్రాథమిక అవసరాలపై మాత్రమే పనిచేస్తుంది. ఆకలి, చలి, నొప్పి లేదా అసౌకర్యం వంటి భావాలను ఏడుపు ద్వారా వ్యక్తపరుస్తారు. నవ్వడానికి భద్రత, ఆప్యాయత, ముఖాలను గుర్తించే సామర్థ్యం అవసరం. ఇది వారాలు, నెలల్లో నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.
పుట్టిన తర్వాత ప్రారంభ రోజుల్లో ఏడుపు బిడ్డ భాష. ఆకలిగా ఉన్నప్పుడు, డైపర్ తడిగా ఉన్నప్పుడు, నిద్ర వచ్చినప్పుడు లేదా కడుపులో గ్యాస్ వచ్చినప్పుడు ఏడుపుతో వాటిని సూచిస్తారు. అందుకే వైద్యులు ఏడుపును సమస్యగా కాకుండా కమ్యూనికేషన్ మార్గంగా భావిస్తారు.