Ram Gopal Varma Konda Movie: 'కొండా' తెలంగాణ 'రక్త చరిత్ర' అవుతుందన్న ఆర్జీవీ..ఆకట్టుకుంటున్న పోస్టర్స్
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు కొండా మురళీధర్ రావు, సురేఖ దంపతుల జీవితాన్ని ఆర్జీవీ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆర్జీవీ 'కొండా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 80వ దశకంలో జరిగిన ప్రేమకథతో నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్‌కి ‘కొండా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. యంగ్ హీరో అదిత్ అరుణ్, వర్మ ‘భైరవగీత’ లో నటించిన ఐరా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాను పూర్తిగా తెలంగాణ యాసలో తెరకెక్కించనున్న మొదటి చిత్రం 'కొండా' అన్నారు ఆర్జీవీ. యాదృచ్ఛికంగా యాదగిరి పాత్రలో తెలంగాణ యాసను ఉపయోగించిన మొదటి చిత్రం శివ అని ట్వీట్ చేశారు. 'కొండా' సినిమా 80 ల చివరలో జరిగిన కథ మాత్రమే కాదు..భయపెట్టే నక్సల్ బ్యాక్ డ్రాప్ కి వ్యతిరేకంగా బలమైన ప్రేమకథ కలగలపి ఉంటుందన్న ఆర్జీవీ ఈ ‘కొండా’ బయోపిక్ తెలంగాణ ‘రక్తచరిత్ర’ అవుతుందని పోస్ట్ చేశారు.
వరంగల్‌లో కొండా సురేఖ, మురళి దంపతులకు రాజకీయంగా మంచి పేరు, పలుకుబడి ఉంది. వరంగల్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఈ కాలేజీలో చదువుకునే సమయంలోనే సురేఖ మురళీ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథ నుంచి రాజకీయ ప్రస్థానం వరకు తెరకెక్కించనున్నారు వర్మ.
ఇప్పటికే సీక్రెట్‌గా వరంగల్‌లో పర్యటించిన ఆర్జీవీ కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ కోసం LB కళాశాలలో సిబ్బంది, అధ్యాపకులను కలిసి కొంత సమాచారం సేకరించారు.
వర్మ తాజాగా విడుదల చేసిన 'కొండా' ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకోవడంతో ఈ క్రేజీ బయోపిక్ పై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.