AP Schools Reopen Date: ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూల్స్ రీఓపెన్
AP Schools Reopen Date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్కూల్స్ తెరుచుకోనున్నాయి. ఆగస్టు 16 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా కారణంగా పాఠశాలలు, విద్యా సంస్థలు మూతపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పాఠశాలలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
జూలై 15 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు వర్క్ బుక్స్‌పై టీచర్లకు శిక్షణ ఉంటుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు మొదటి వారం కల్లా పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న నాడు-నేడు పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు జూలై 12 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ సెకండియర్ తాత్కాలిక అకడమిక్ క్యాలెండర్‌ను సైతం విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 213 రోజులు కాలేజీలు పనిచేస్తాయని తెలిపింది.
ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్థులకు సెకండియర్ మార్కులు కేటాయించాలని నిర్ణయించింది. జూన్ ఆఖరులోగా మార్కుల మెమోలను జారీ చేయనుంది.