Sundar Pichai: ప్రపంచంలో ఏ మూలకెళ్లినా నేను భారతీయుడినే - పద్మ భూషణ్ స్వీకరించిన సుందర్ పిచాయ్
గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్ అందుకున్నారు. అమెరికాలో భారత రాయబారి తరణ్ జీత్‌సింగ్ సంధూ ఆయనకు పురస్కారం అందజేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవాణిజ్యం, పరిశ్రమల విభాగంలో సుందర్ పిచాయ్‌కు భారత్ పద్మ భూషణ్ ప్రకటించింది. జనవరిలోనే పేరు ఎంపిక చేసినా పురస్కారం స్వీకరణకు ఇంతకాలం పట్టింది. కుటుంబ సభ్యుల సమక్షంలో సాన్ ఫ్రాన్సిస్కోలో పిచాయ్ అవార్డు స్వీకరించారు.
'భారత్ నాలో అంతర్భాగం. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నేనీ గుర్తింపు తీసుకెళ్తూనే ఉంటాను' అని సుందర్ అన్నారు. 'ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందజేసినందుకు ప్రభుత్వానికి, భారత ప్రజలకు నేను కృతజ్ఞుడిని. గూగుల్, భారత్ భాగస్వామ్యం మరింత ముందుకెళ్లేందుకు కృషి చేస్తాను. టెక్నాలజీ ప్రయోజనాలను మరింత మందికి చేరేందుకు కృషి చేస్తాను' అని ఆయన వెల్లడించారు.
ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా విజన్ వృద్ధికి జోరందిస్తోంది. భారత్‌లో గూగుల్ పెట్టుబడులు కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాలు, వ్యాపారాలు, కమ్యూనిటీల్లో భాగస్వాములం అయినందుకు గర్వంగా ఉందని సుందర్ పిచాయ్ అన్నారు.
అవుధులు లేని సాంకేతికత, పరివర్తనకు సుందర్ పిచాయ్ ప్రతినిధిగా మారారని సంధూ అన్నారు. 'డిజిటల్ టూల్స్ రూపకల్పనలో సుందర్ పిచాయ్ గొప్పగా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సాంకేతికతను వాడుకొనేందుకు, నైపుణ్యాలు పెంచుకొనేందుకు పనిచేస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు.