Kapil Dev Meets Chandrababu: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ - చర్చించిన చంద్రబాబు, కపిల్ దేవ్
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ మంగళవారం విజయవాడకు వచ్చారు. అనంతరం విజయవాడ ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.
అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఏర్పాటు చేయడంపై ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కపిల్ దేవ్, ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. దాంతోపాటు అనంతపురం, వైజాగ్‌లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయడం.. ఏపీలో స్పోర్ట్స్ అభివృద్దిపై చర్చించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
గోల్ఫ్ కోర్స్ క్లబ్ ఏర్పాటుతో రాష్ట్ర యువత గోల్ఫ్ పై ఆసక్తి పెంచుకుని, ఈ ఆటలో కొత్త క్రీడాకారులు పుట్టుకొస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో ఆటలకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో స్పోర్ట్స్ కు చేయూత అందించి, స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి ఏపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, ఆయన టీంను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.