In Pics: తిరుపతిలో వైభవంగా గంగమ్మ జాతర, సారె సమర్పించిన ఎమ్మెల్యే భూమన
తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి సారె సమర్పించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్థానిక పద్మావతి పురంలోని భూమన నివాసం వద్ద బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భూమన కరుణాకర రెడ్డి, వారి కుటుంబ సభ్యులు పళ్లాలపై పసుపు, కుంకుమ, పూలు, పళ్లు, రవిక, పట్టు చీరలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మ వారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
గ్రామ దేవత గంగమ్మ సారె సమర్పణ కార్యక్రమం భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ క్రమంలో భూమన నివాసం నుంచి అమ్మవారి ఆలయం వరకు జనసందోహంగా మారింది.
వీధులు అన్నీ వేపాకు తోరణాలతో పాటు మామిడి, అరటి తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ, కర్పూర హారతులిస్తూ స్వాగతించారు.
స్థానికులు పెద్ద ఎత్తున గంధం బొట్లు పెట్టుకుని, వేపాకు చేతబూని, వివిధ వేష ధారణలతో వచ్చేసి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు.
దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి కీర్తనలతో, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించి పోయారు.
గంగమ్మ నామ స్మరణతో తిరునగరి హోరెత్తింది. నవ దుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు, తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల కళాప్రదర్శలు ఆకట్టుకున్నాయి.
వేసవి తీవ్రతను లెక్కచేయకుండా శోభా యాత్ర కొనసాగింది.
భూమన నివాసం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతర్లలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది.
తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు సమ్మక్కసారక్క జాతర్ల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది.