Tirumala Devotees Rush: లాంగ్ వీకెండ్ ఎఫెక్ట్, తిరుమల కొండపై మరింత పెరుగుతున్న భక్తుల రద్దీ
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.
జూన్ 17 వరకు వారాంతపు సెలవులు (Weekend Holidays) ఉండడంతో శనివారం జూన్ 15న కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట భక్తుల క్యూ లైన్లు శనివారం సైతం యాత్రికులతో నిండిపోయాయి.
గురువారం (జూన్ 13) నుంచి తిరుమలకు యాత్రికుల తాకిడి తగ్గలేదు. మరోవైపు సోమవారం జూన్ 17న కూడా సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ ఇంకా కొనసాగనుంది.
శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD).
టీటీడీ జేఈవో (TTD JEO) వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ అధికారులు, విజిలెన్స్, సెక్యూరిటీ విభాగం, టీటీడీ శ్రీవారి సన్నిధిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, తాగునీటిని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
డిప్యూటీ ఈవో అన్నప్రసాదం రాజేంద్ర, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, వాటర్ వర్క్స్ ఈఈ శ్రీహరి, చీఫ్ పీఆర్‌వో డాక్టర్ టి.రవి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీనివాసులు, ఏవిఎస్‌వో సత్యసాయి గిరిధర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి తదితరులు రద్దీ మొదలైనప్పటి నుంచి ఏర్పాట్లను దగ్గరుండీ మరి పర్యవేక్షిస్తున్నారు.