SriVari Brahmotsavam: చిన్నశేష వాహనంపై గీతా కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమలి పింఛం, పిల్లనగ్రోవి ధరించి గీతా కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిన్నశేష వాహనం - కుటుంబ శ్రేయస్సు
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నమూనా బ్రహ్మరథం, వృషభ, అశ్వ, ఏనుగుల సెట్టింగ్.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మరథం, వృషభ, అశ్వ, ఏనుగులదే అగ్రస్థానం. కానీ కోవిడ్ - 19 కారణంగా ఆలయంలోని కల్యాణమండపంలో స్వామివారి వాహనసేవలు ఏకాంతంగా జరుగుతున్న విషయం విదితమే. శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో నమూనా బ్రహ్మరథం, వృషభాలు, అశ్వాలు, ఏనుగుల సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డా. కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, శ్రీ సనత్‌కుమార్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.