Zelensky on Putin:
నెదర్లాండ్స్‌లో జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ చేస్తున్న నేరాలకు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడని తేల్చి చెప్పారు. త్వరలోనే ఇది జరిగి తీరుతుందని జోష్యం చెప్పారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్న హేగ్ నగరంలోనే ఈ కామెంట్స్ చేశారు జెలెన్‌స్కీ.
"పుతిన్ తన బలాన్ని చూసుకుని మిడిసిపడుతున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేసి తీవ్రమైన నేరం చేశారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్న ఈ హేగ్ సిటీలో పుతిన్‌ను చూడాలని ఉంది. ఆ కోర్టు విధించిన శిక్ష అనుభవిస్తూ పుతిన్ ఇక్కడే ఉండాలని మేం బలంగా కోరుకుంటున్నాం. అలాంటి శిక్షకు ఆయన అర్హుడే. కచ్చితంగా ఇది జరుగుతుందని ఆశిస్తున్నాం. మేం విజయం సాధించిన వెంటనే పుతిన్‌కు శిక్ష పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. యుద్ధానికి కారణమైన వాళ్లు ఇలాంటి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు"
- జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
అరెస్ట్ వారెంట్..
ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్నారు జెలెన్‌స్కీ. నెదర్లాండ్స్ మొదటి నుంచి ఉక్రెయిన్‌కు మద్దతునిస్తోంది. ఆ దేశంలో అడుగు పెట్టిన వెంటనే అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్‌ని సందర్శించారు. ఆ కోర్టు బయట ఉక్రెయిన్ దేశ పౌరులు కొందరు జెలెన్‌స్కీని చూసేందుకు వచ్చారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్‌కు షాక్ ఇచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు దేశం ఉక్రెయిన్ పై జరిపిన యుద్దం, మారణకాండకు పుతిన్ ను బాధ్యుడ్ని చేస్తూ క్రిమినల్ కోర్టు రష్యా అధినేతపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతర్జాతీయ మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం కేవలం ఆరంభం మాత్రమేనని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. త్వరలోనే తమకు న్యాయం జరుగుతుందని, రష్యాకు కోర్టులోనే శిక్ష పడుతుందని గతంలోనే తేల్చి చెప్పింది. అయితే...రష్యా మాత్రం ఈ నిర్ణయాన్ని ఖండించింది. "ICC తీసుకున్న ఏ నిర్ణయమైనా చెల్లదు. రష్యా చట్టం ప్రకారం ఈ తీర్పుని మేం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు" స్పష్టం చేసింది.
పుతిన్‌పై హత్యాయత్నం..
క్రెమ్లిన్‌లోని పుతిన్ ఆఫీస్‌పై డ్రోన్‌లు కనిపించడం సంచలనమైంది. వెంటనే అలెర్ట్ అయిన రష్యా సైన్యం రెండు డ్రోన్‌లను కూల్చి వేసింది. ఇది ఉక్రెయిన్ పనేనని, పుతిన్‌ను హత్య చేసేందుకు కుట్ర చేసిందని ఆరోపించింది రష్యా. దీనికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ప్రకటించింది. దీన్ని ఓ ఉగ్రదాడిగానే భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. మాస్కోలో డ్రోన్‌లపై నిషేధం విధించింది. ఇప్పుడే కాదు. రష్యాలో పలు సార్లు ఇలాంటి డ్రోన్ దాడులు జరిగాయి. ప్రతిసారీ ఉక్రెయిన్‌పై వేలెత్తి చూపుతోంది రష్యా. అయితే..ఇప్పటి వరకూ ఉక్రెయిన్ మాత్రం ఆ దాడులు తామే చేసినట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ సారి మాత్రం వెంటనే స్పందించింది. ఈ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అటు రష్యా మాత్రం ఈ దాడి వెనకాల ఉక్రెయిన్‌తో పాటు అమెరికా హస్తం కూడా ఉందని ఆరోపిస్తోంది.
Also Read: Google Sign-in: పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ అయిపోవచ్చు, గూగుల్ కొత్త ఫీచర్ అదుర్స్