Kakinada News: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫాక్టరీలో గురువారం ఉదయం జరిగిన దుర్ఘటనలో ఏడుగరు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు వైసీపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి  25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలిపారు. 


గురువారం ఉదయం ప్రమాదం జరిగినట్లు తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. అధికారులతో కలిసి జి.రాగంపేటలోని ఆయిల్ ఫ్యాక్టరీకి వెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద కారణాలను ఆరా తీశారు. ఉదయం 7 గంటల సమయంలో  ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంక్ ను శుభ్రపరిచే సందర్భంలో ఊపిరి ఆడక ఏడుగురు వ్యక్తులు మరణించారని, వీరిలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరుకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారని వివరించారు. పాడేరుకు చెందిన ఐదుగు వ్యక్తులు.. వెచంగి కృష్ణ (35), వెచంగి నరసింహ (38), వెచంగి సాగర్ (20), కురవడు బంజుబాబు, కుర్రా రామారావు కాగా, పులిమేరుకు చెందిన ఇరువురు వ్యక్తులు కట్టమూరి జగదీష్ (25), యల్లమిల్లి దుర్గాప్రసాద్ లు గా గుర్తించారు. 


ఒక్కో కుటుంబానికి  25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా 
ప్రమాదం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని, ఒక్కొక్కరికీ 25 లక్షలు వంతున ఎక్స్ గ్రేషియా సహాయన్ని ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకున్న పోలీసులు... ప్రమాదం జరిగిన ఫాక్టరీని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్,  జిల్లా పరిశ్రమల అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, పెద్దాపురం ఆర్డీవోలతో కూడిన ఐదుగురులు అధికారుల బృందాన్ని నియమించామని, మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ బృందాన్ని ఆదేశించామని కలెక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ జె.సీతారామారావు, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ రాధాకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.


బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం


ఆయిల్ ఫ్యాక్టరీ ట్యాంకర్ క్లీనింగ్ ఘటనలో కార్మికులు మృతి చెందడం పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తరచూ పరిశ్రమల్లో  అనూహ్యంగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ రాష్ట్రం ప్రభుత్వం, అధికారులు వారికి పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరును సోము వీర్రాజు తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో  పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయని, మంత్రులు ఎక్స్‌గ్రేషియాలు చెల్లిస్తూ కంటి తుడుపు చర్యగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడం వారి పనితీరుపై నిర్లక్ష్యం కనపడుతుందని తీవ్రంగా విమర్శించారు.