Andhra Politics :  రాజకీయాల్లో ఏదైనా  సాధ్యమే. ఈ విషయం వైఎస్ కుటుంబాన్ని చూస్తే మరోసారి అర్థం అవుతుంది. అన్న వదిలిన బాణాన్ని అంటూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు అన్నను ఎదిరిస్తూ నిలబడ్డారు. ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా  పూర్తిగా  స్థాయిలో తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. కడప లోక్‌సభ బరిలో నిలబడ్డారు. ఆమెకు తోడుగా మరో సోదరి సునీత ఉన్నారు. ఇక్కడి వరకూ వచ్చాక మొహమాటాలేమిటని ఆమె నేరుగానే జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు.    వైఎస్ వివేకా హత్య కేసులో హంతకులకు అండగా నిలవడంతో జగన్మోహన్ రెడ్డిపై యుద్ధం ప్రకటించారు సోదరీమణులు. వారు రోజు రోజుకు తమ డోస్ పెంచుకుంటూ పోతున్నారు. 


వైఎస్ వివేకా హత్యను ఎజెండాగా చేస్తున్న షర్మిల 


కడప లోక్‌సభలో షర్మిల ప్రజల్ని  హంతకుడిగా.. వైఎస్ బిడ్డకా మీ ఓటు అని సూటిగా ప్రశ్నిస్తూ.. వస్తున్నారు. ప్రచారంలో ఈ ఎటాక్ తర్వాత స్థాయికి వెళ్తోంది. వైసీపీ ప్రధాన ఓటు బ్యాంక్ అయిన దళితులు, ముస్లింల ఓట్ బ్యాంక్‌ను కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు షర్మిల వ్యూహాత్మకంగా గురి పెట్టారు.  బీజేపీకి గులాంగిరి చేస్తున్నారని.. బీజేపీ, వైసీపీ వేర్వేరు కాదని ప్రజల్లోకి  బలంగా తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో దళిత నేతల్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి ఆకర్షిస్తున్నారు. వైసీపీలో టిక్కెట్ దక్కని దళిత నేతల్ని వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇంతకు ముందే ఆర్థర్, ఎలీజా పార్టీలో చేరగా ఇవాళ పూతలపట్టు ఎమ్మెల్యేను చేర్చుకున్నారు. గుంటూరుకు చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ తీరుతో మోసపోయిన నేతలంతా కాంగ్రెస్ గూటికే చేరుకుంటున్నారు.   మరో వైపు వైఎస్ సునీత కూడా ప్రతి రోజూ ఏదో ఓ టాపిక్ పై మాట్లాడుతున్నారు. షర్మిల ప్రచారం ప్రారంభంలో పాల్గొని.. ఆమె కూడా జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు. మూడు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి జగన్ ఓటమే లక్ష్యమన్నారు. శనివారం కూడా జస్టిస్ ఫర్ వివేకా  పేరుతో ప్రెస్మీట్ పెట్టి కీలక విషయాలను వెల్లడించారు. అవినాష్ రెడ్డికి మళ్లీ టి్క్కెట్ ఇవ్వడంతో వీరు ఏ మాత్రం తగ్గకూడదని డిసైడయ్యారు.


వైఎస్ ఫ్యామిలీ అడ్డా కడప - కానీ ఇప్పుడు వారసులెవరు ? 


కడప పార్లమెంటు నియోజకవర్గం   వైఎస్ ఫ్యామిలీ అడ్డా  . కడప ఎంపీగా వైఎస్ కుటుంబసభ్యులే గెలుస్తూ రావడం రివాజుగా మారింది. అక్కడ నుంచి దివంగత నేతలు వైఎస్, వివేకా, వారి తర్వాత  జగన్ లోక్‌సభకు భారీ మెజార్టీలతో ఎన్నికయ్యారు. జగన్ ఆ సీటును ఖాళీ చేసిన తర్వాత  అవినాశ్‌రెడ్డికి చాన్సిచ్చారు. రెండు సార్లు ఆయన కూడా భారీ మెజార్టీలతో గెలిచారు.   1989లో కడప నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి గెలుపొందిన నాటి నుంచి అక్కడ వారికి ఓటమే లే కుండా పోయింది. ఒక్క కడప ఎంపీ స్థానం పరిధిలోనే కాదు జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ ఫ్యామిలీ పెత్తనమే కొనసాగుతూ వచ్చింది. అటువంటి వైఎస్ కుటుంబం ఇప్పుడు రాజకీయంగా చీలిపోయింది . వివేకానంద రెడ్డి హత్య జరిగిన కొద్ది రోజులలోనే వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయి . సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యానికి జగనే కారణమన్న టాక్ ఉంది.. ఎందుకంటే జగన్‌కి తమ్ముడయ్యే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, అతని తండ్రి ఆ హత్య కేసులో నిందితులు.. దాంతో వివేకా కూతురు జగన్‌తో విభేదించి పోరాటానికి దిగారు. ఆమెతో షర్మిల కలిశారు. వైఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ అనుకునే చాలా మంది నేతలు జిల్లాలో వారంతా ఇప్పటివరకు   వైసీపీ వెంట నడుస్తున్నారు . కానీ ్ంతర్గతంగా అసంతృప్తి ఉంది.  వారంతా ఆమె వెంట నడిచే అవకాశాన్ని కొట్టిపారేయలేం.. మరోవైపు వైసీపీ టికెట్ ఆశించి భంగపడిన వారిలో చాలా మందికి షర్మిల ఆశాకిరణంలా కనిపిస్తున్నారు.  


వివేకా హత్య చుట్టూనే  కేసు తిరిగితే వైసీపీకి ఇబ్బందే ! 
   
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు - ప్రజల్లో వైఎస్ఆర్ సీపీపై ఎలా పోరాడుతున్నారో షర్మిల కూడా అలాగే పోరాుతున్నారు.  బద్వేలు, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, శాసనసభా నియోజకవర్గాలు వున్న కడప లోక్ సభ ఓటర్ల 16 లక్షలమంది. కడప నుంచి లోక్ సభకు వైఎస్ రాజశేఖరరెడ్డి 4 సార్లు , వివేకానందరెడ్డి 2 సార్లు, జగన్ రెండుసార్లు, అవినాష్ రెడ్డి 2 సార్లు ఎన్నికయ్యారు.  వివేకా హత్య కేసులో  కేసులో నిందితుడు కడప ఎంపి అయిన అవినాష్ కే జగన్ మద్దతు వుందన్న విషయం బహిరంగ రహస్యమైపోయింది. సొంత బాబాయి హంతకులపై ఏ చర్యలూ తీసుకోని జగన్ అధికారంలో వుంటే రాష్ట్రానికే భద్రతలేదని కనుక ఆయన్ని ఓడించాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత  జగన్ పై వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. జగన్ సొంత చెల్లి ఎన్నికల స్థానిక ఎజెండా కూడా ఈ అంశమే అవుతుంది. దీనికితోడు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పని కూడా కొనసాగుతూనే వుంటుంది. షర్మిల చేస్తున్న విమర్శలపై అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి వంటి వారు స్పందించడంతో  రాబోయే రోజుల్లో మరితంగా ఈ కేసు చుట్టూ రాజకీయం నడిచే అవకాశాలు ఉన్నాయి.


కడపలో షర్మిల గెలిస్తే రాజకీయంగా పెను మార్పులు 


జగన్ సొంత మనిషిగా అవినాష్ రెడ్డి ఎన్నిక వరకూ కడపపై కుటుంబ వారసత్వంలో సమస్య బయటపడ లేదు. ఇపుడు అదే స్ధానం  కోసం షర్మిల పోటీ పడుతూండటం వల్ల రాష్ట్ర వ్యాప్త ఆసక్తి వ్యక్తమవుతోంది.  వివేకానందరెడ్డి డాక్టర్ సునీత, షర్మిల  సూటి ప్రశ్నలకు అవినాష్ రెడ్డి నుంచి కాని, ముఖ్యమంత్రిగా జగన్ నుంచి కాని ధీటైన సమాధానాలు రావం లేదు. కాకపోతే వారిపైనే నిందలేస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.  వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ లో వున్నవారిలో 95 శాతం మంది కాంగ్రెస్ వారే! వారిలో జగన్ పాలనను వ్యతిరేకించే వారు, కూటమి నచ్చని వారిలో హెచ్చుమంది కాంగ్రెస్ కే ఓటు వేసే అవకాశం వుంది. దీనికితోడు జగన్ పార్టీ ఓటమిని గట్టిగా కోరుకునే చంద్రబాబు పార్టీ గాని, పవన్ కళ్యాణ్ పార్టీగాని వైసీపీని ఓడించడానికే ప్రాధాన్యం ఇస్తారు.  ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఓడిపోతే అది షర్మిల  ప్రతిష్టను పెంచుతుంది. కాంగ్రెస్ లో ఆమె పలుకుబడి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నిలదొక్కుకోగలదన్న భరోసా వస్తుంది. కడపను కోల్పోతే జగన్ రాజకీయ పునాదులు పోగొట్టుకున్నట్లవుతుంది.


వైఎస్ కుటుంబ ఓట్లు చీలి టీడీపీ లాభపడుతుందా ?
 
వైఎస్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలు తెలుగుదేశం పార్టీకి కొత్త అవకాశంలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే  కడప జిల్లా ఓటర్లలో వైఎస్ కుటుంబసభ్యులను వ్యతిరేకించే వర్గంగా ఎప్పుడో విడిపోయింది. ఆ వర్గం టీడీపీని అంటి పెట్టుకుని వారు షర్మిల వైపు మొగ్గు  చూపే అవకాశం లేదు. వైఎస్ , వైసీపీ ఓటు బ్యాంకునే రెండు  వర్గాలు పంచుకుంటాయి. ఈ ఓట్ల చీలికతో తాము బలపడతామని..దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న విజయాన్ని అందుకుంటామని నమ్మకంతో ఉన్నారు. ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులలో కూడా టీడీపీ అభ్యర్థికి  మెజార్టీ వచ్చింది. ఇదే వారికి కొత్త ఆశల వైపు నడిపిస్తోంది.